తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు | kajal aggarwal interview about sita | Sakshi
Sakshi News home page

తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు

May 20 2019 12:20 AM | Updated on Aug 3 2019 12:45 PM

kajal aggarwal interview about sita - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

‘‘సీత’ సినిమా స్టోరీ తేజగారు నాకు ఎప్పుడో చెప్పారు. అప్పటి టైమ్‌కు సెట్‌ అవుతుందా? అనుకున్నాం. అప్పుడు నా డేట్స్‌ కూడా ఖాళీ లేవు. అలా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాం. ‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలో ‘సీత’ సినిమా నాతోనే తీయాలి. వేరే హీరోయిన్‌తో మిమ్మల్ని చేయనివ్వనని ఆటపట్టించేదాన్ని. పెర్ఫామ్‌ చేయడానికి చాలా స్కోప్‌ ఉన్న పాత్ర ఇది. అందుకే మిస్‌ చేసుకోకూడదు అనుకున్నాను’’ అని కాజల్‌ అగర్వాల్‌ చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.

► నాకు పురాణాలంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమాకు పురాణాలకు ఎక్కువ సంబంధం లేదు. ఇదంతా ప్రస్తుత కాలంలో జరిగే కథ. సినిమాలో ఎక్కువ మానవ సంబంధాలు, లక్ష్యాల గురించి చర్చించాం. కొందరమ్మాయిలు సింపుల్‌గా పెళ్లి చేసుకుని సెటిలైతే చాలు అనుకుంటున్నారు. కొందరమ్మాయిలు ఏదైనా సాధించాలనుకుంటారు. ఇందులో నా పాత్రకు ఓ గోల్‌ ఉంటుంది. దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తుంటుంది. తను చాలా స్వార్థపరురాలు.

► తేజగారు స్క్రిప్ట్‌కు తగ్గ టైటిల్‌ మాత్రమే పెడతారని మనకు తెలుసు. దీనికి అలానే పెట్టారు. నటిగా నా కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పటి నుంచి నా ప్లస్, మైనస్సులు ఆయనకు తెలుసు. ఇందులో నటిగా నన్ను ఇంకా పుష్‌ చేశారు. తేజగారంటే నాకు చాలా గౌరవం. సినిమా మీద ఆయనకున్న డ్రైవ్‌ ‘లక్ష్మీ కల్యాణం’ సమయంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఆయన నాకు లక్కీ.

► సాయిశ్రీనివాస్‌తో మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. మేమిద్దరం ‘కవచం’ సినిమా చేయడం వల్ల ఈ సినిమాకు ఇంకా ప్లస్‌ అయిందనుకుంటున్నాను. నా పాత్ర కంటే కూడా తనది ఇంకా కష్టమైన పాత్ర. చాలా బాగా చేశాడు. యంగ్‌ హీరోలతో యాక్ట్‌ చేసినా డామినేట్‌ చేయను. సరదాగా టీజ్‌ చేస్తానేమో.

► ఈ సినిమాలో నా పాత్రను కొందరు రిలేట్‌ చేసుకోవచ్చు. కొందరు ఇలా ఉందేంటి? అని కూడా అనుకోవచ్చు. నా పాత్రకు నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయి. ఈ పాత్రను కొన్నిసార్లు నేనూ రిలేట్‌ చేసుకున్నా, కొన్నిసార్లు ఇది టూమచ్‌ అనుకున్నాను. ప్రతీ సీన్‌ ముందు తేజగారు కొంచెం బ్రెయిన్‌ వాష్‌ కూడా చేశారు. ఆ పాత్ర అలాంటిది.

► సీత పాత్ర చేయడానికి హోమ్‌వర్క్‌ అంటే.. తేజగారితో చాలా డిస్కషన్స్‌ చేశాను. సీత ఎలా ఉంటుంది అని నోట్స్‌ రాసుకున్నాను. చాలా పుస్తకాలు చదివాను. అలాగే ఈ సినిమాలో నా స్టంట్స్‌ నేనే చేసుకున్నాను. గాయాలు కూడా అయ్యాయి. నా వీపు అంతా ప్లాస్టర్స్‌తో నిండిపోయింది. నిటారుగా కూర్చోలేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిజియోథెరఫీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది.

► నా తోటి హీరోయిన్లు ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్నారని నేను చేయను. నాకు నచ్చాలి కదా? పక్కవారితో పోల్చి చూసుకోను. నా దగ్గరకు వచ్చిన వాటిలో బెస్ట్‌ పిక్‌ చేసుకుంటాను.

► 23న ఎన్నికల రిజల్ట్స్‌ రాబోతున్నాయి. 24న మా సినిమా రిలీజ్‌ కాబోతోంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అంటే ఆ ఉద్దేశమే లేదు. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉంది. సినిమాలు చేసే ప్రాసెస్‌ను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించను.

► తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా, తమిళంలో క్వీన్‌ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’, ‘జయం’ రవితో చేసిన ‘కోమలి’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘భారతీయుడు 2’ జూన్‌ నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. మరో ప్రాజెక్ట్‌ వివరాలు రెండు రోజుల్లో తెలియజేస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement