
రజనీకాంత్
తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు విడుదల సమయంలో ఏదో రకమైన సమస్యలను ఎదుర్కోవడం పరిపాటిగా మారుతోంది. కమలహాసన్ తాజా చిత్రం విశ్వరూపం– 2 సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇక రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలా’కు కర్ణాటకలో సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని అంటున్నారు సినీ వర్గాలు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం కాలా. ఈశ్వరిరావు, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ, నానాపటేకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కబాలీ చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. కాగా ఇది ముంబాయిలోని ధారవి నేపథ్యంలో జరిగే ఒక దాదా కథగా తెరకెక్కిన చిత్రం అని, ఇందులో రాజకీయ పరమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయడానికి నిర్మాత ధనుష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై రజనీకాంత్ గత చిత్రాలన్నింటికంటే అధికంగా అంచనాలు, ఆసక్తి పెంచుకున్నారు. కారణం చిత్రంలో రాజకీయ సెటైరికల్ సంభాషణలు ఒక అంశం కాగా.. ఇది రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత విడుదల కానున్న చిత్రం కావడం మరో అంశం.
కర్ణాటకలో వ్యతిరేకత..
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. కాలా చిత్రానికి కర్ణాటకలో కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అవి కావేరి రూపంలో ఎదురవ్వనున్నాయి. కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో నటుడై ఇక్కడే పేరు, ప్రఖ్యాతులు పొందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కావేరి మేనేజ్‌మెంట్ సమస్య తమిళనాడు, కార్ణాటక మధ్య ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్న రజనీకాంత్ తమిళనాడుకు కావేరి వ్యవహారంలో మద్ధతుగా మాట్లాడాల్సిన నిర్భంధానికి గురయ్యారు. ఆయన అదే చేశారు కూడా. సమీపకాలంలో కావేరి మేనేజ్‌మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ కోలీవుడ్ నిర్వహించిన దీక్షలోనూ రజనీకాంత్ పాల్గొన్నారు. దీంతో కన్నడిగులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొన్ని కర్ణాటక సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రజనీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలను అడ్డుకుంటామంటున్నారు.
నటుడు సత్యరాజ్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక పాత్రలో నటించిన బాహుబలి చిత్ర విడుదలనే కన్నడిగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి సత్యరాజ్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అలాంటిది కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ విషయంతో కన్నడిగులు ఉదారతను చూపిస్తారని ఊహించలేం. మరి ఈ సూపర్‌స్టార్ కూడా సారీ చెబుతారా? కాలా ఎలాంటి సమస్య లేకుండా కర్ణాటకలో విడుదలవుతుందా? అన్న ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది.