నా కల నిజమవుతోంది

Jr NTR Speech At Entha Manchivaadavuraa Pre Release Event - Sakshi

– ఎన్టీఆర్‌

‘కల్యాణ్‌ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. కమర్షియల్, థ్రిల్లర్, మాస్‌ సినిమాలు చేశారు. నాకు ఎప్పటి నుంచో ఓ వెలితి ఉండేది. ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో అన్నని చూడాలని ఉండేది.. అది ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో ఈరోజు వేగేశ్న సతీష్‌గారి ద్వారా నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. కల్యాణ్‌ రామ్, మెహరీన్‌ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్‌ వేగేశ్న సతీష్‌  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’.

శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌ పతాకంపై ఉమేష్‌ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథి ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – ‘‘శివలెంక కృష్ణప్రసాద్‌గారు మా కుటుంబానికి ఒక నిర్మాత కాదు.. బాబాయ్‌తో (బాలకృష్ణ) ఎన్నో సినిమాలు తీసిన  ఆయన మా కుటుంబంలో ఓ సభ్యుడు.

అలాంటి కృష్ణప్రసాద్, ఉమేష్‌ గుప్తగారి నిర్మాణంలో ఓ మంచి సినిమా మీ ముందుకొస్తోంది. గోపీసుందర్‌గారు మంచి సంగీతం అందించారు. ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. మంచి మనసుతో మంచి చిత్రాన్ని ఆదరించేటటువంటి గొప్ప గుణం మీ అందరిలో ఉంది.. మన తెలుగు ప్రేక్షక దేవుళ్లలో ఉంది. మీరందరూ గొప్ప హృదయంతో, గొప్ప మనసుతో వీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సహాయ, సహకారాలు అందజేస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటన్నా.

మీరందరూ మంచి ఆనందం, కోలాహలంతో ఉన్నారు.. ఇదే ఆనందం మీ ఇంటి వరకూ వెళ్లి పంచుకోండి.. ఇక్కడున్న మీ అందరి ప్రాణం మీ తల్లిదండ్రులకి, మీ అన్నాచెల్లెళ్లకి, ముందుగా మీ కుటుంబ సభ్యులకి, దాని తర్వాత నాకు, కల్యాణ్‌ అన్నకు, మా కుటుంబానికి ఎంతో అవసరం.. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలి. ఈ పండుగ వాతావరణంలో విడుదలవుతున్న ‘దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో..’ తో పాటు మా ‘ఎంత మంచివాడవురా’ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి, తెలుగు చిత్రసీమ ముందుకు వెళ్లేలా దోహద పడాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ.. జై ఎన్టీఆర్‌.. జోహార్‌ హరికృష్ణ’’ అన్నారు.

కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘నిర్మాణంలోకి అడుగుపెడుతున్న ఉమేష్‌ గుప్త, సుభాష్‌ గుప్తగార్లను ఇండస్ట్రీకి స్వాగతం పలుకుతున్నాను. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. నేడు రజనీకాంత్‌గారి ‘దర్బార్‌’ విడుదలవుతోంది. 11న మహేశ్‌బాబుగారు, మా అనిల్‌ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తుంది. అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో..’ ఈ నెల 12న విడుదలవుతుంది. అందరి సినిమాలూ బాగా ఆడాలని, మా సినిమా ఇంకా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఉమేష్‌ గుప్త మాట్లాడుతూ– ‘‘ఎంత మంచివాడవురా’ సినిమా నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది. బాగా కష్టపడే టీమ్‌తో మా మొదటి సినిమాని తీసినందుకు సంతోషంగా ఉంది. కల్యాణ్‌రామ్‌ చాలా బాగా నటించారు. జాతీయ అవార్డు గ్రహీత వేగేశ్న సతీష్‌గారితో  మా తొలి చిత్రం చేయడం అదృష్టం. 30ఏళ్లుగా మాకు సహకారం అందిస్తూ, ప్రోత్సహిస్తున్న చిత్ర పరిశ్రమవారికి ధన్యవాదాలు’’ అన్నారు.

శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘నందమూరి కుటుంబం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. సీనియర్‌ ఎన్టీఆర్‌గారి నుంచి ఈ క్రమశిక్షణ అలాగే వస్తోంది. ఈ పండుగ రోజున ‘ఎంత మంచివాడవురా’ సినిమా వస్తోంది.. మనందరం ఎంజాయ్‌ చేద్దాం’’ అన్నారు.

నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి పోటీలో నందమూరి సినిమా కూడా నిలబడింది. ఉమేష్‌ గుప్తగారు నాకు ఇరవై ఏళ్లుగా మిత్రులు. ‘పటాస్, 118’ తర్వాత కల్యాణ్‌రామ్‌గారి ఈ సినిమా మా ఆధ్వర్యంలో విడుదలవుతోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కల్యాణ్‌గారికి ఆల్‌ ది బెస్ట్‌. మా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్‌ సంక్రాంతికి వస్తున్నాడు.. తనకు ఆల్‌ ది బెస్ట్‌. అందరం కలిసి సంక్రాంతికి కుమ్మేద్దాం’’ అన్నారు.

వేగేశ్న సతీష్‌ మాట్లాడుతూ– ‘‘నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, రచయితగా జన్మనిచ్చిన ముప్పలనేని శివగారికి, నన్ను దర్శకునిగా చేసిన ఈవీవీ సత్యనారాయణ, ‘అల్లరి’ నరేశ్‌గార్లకు, ‘శతమానం భవతి’ సినిమా ద్వారా పునర్జన్మనిచ్చిన ‘దిల్‌’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌గార్లకు థ్యాంక్స్‌.. వారందరూ లేకుంటే ఈ రోజు నేను ఈ వేదికపైన లేను. మీరందరూ ఇప్పుడు ఈ ఎన్టీఆర్‌గారికి అభిమానులు.. మా నాన్నగారు 1963లోనే సీనియర్‌ ఎన్టీఆర్‌గారికి అభిమానులు.. ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఉపాధ్యక్షులు కూడా. ఇద్దరి ఎన్టీఆర్‌లతో నేను ఫొటో దిగాను.

నందమూరి హీరోతో నేను సినిమా చేసినందుకు మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవారు.. ఆయన లేనందుకు బాధగా ఉంది. ఎన్టీఆర్‌ మాస్‌ చేస్తే ‘సింహాద్రి’.. క్లాస్‌ చేస్తే ‘బృందావనం’.. క్లాసూ, మాసూ మిక్స్‌ చేస్తే ఒక ‘జనతా గ్యారేజ్, అరవింద సమేత’. కల్యాణ్‌రామ్‌గారు మాస్‌ చేస్తే ‘అతనొక్కడే’.. క్లాస్‌ చేస్తే ‘118’.. క్లాసూ, మాసూ మిక్స్‌ చేస్తే మా ‘ఎంత మంచివాడవురా’. ఇంతమంచి అభిమానులను సంపాదించుకున్న మా నందమూరి వాళ్లు ధన్యులు. ఈ సినిమాని 72రోజుల్లో పూర్తి చేయడానికి కారణం నా సాంకేతిక నిపుణులు. సినిమా చాలా బాగొచ్చింది.. ఈ సంక్రాంతికి హిట్‌ కొడుతున్నాం.. సినిమా గురించి సక్సెస్‌మీట్‌లో మాట్లాడతా’’ అన్నారు.

మెహరీన్‌ మాట్లాడుతూ– ‘‘నేను నటించిన ‘ఎఫ్‌ 2’ విడుదలైన  తర్వాత మరో మంచి సినిమా చేయాలని  ఐదు నెలలు ఎదురుచూశాను. సతీష్‌గారు ఈ కథ చెప్పినప్పుడే ఇలాంటి పాత్ర చేసే అవకాశం నాకు మళ్లీ మళ్లీ రాదనిపించింది. భావోద్వేగాలు, అనురాగాలు, ఆలోచన పరిపక్వత ఉన్న నందులాంటి పాత్ర ఈ సినిమాలో నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణలో నేను పాల్గొన్నట్లు లేదు.. మా కుటుంబంతో కలిసి పండగ చేసుకున్నట్లు ఉంది. అప్పుడే షూటింగ్‌ అయిపోయిందా? అనే భావన కలిగింది’’ అన్నారు.

ఈ వేడుకలో నిర్మాతలు సుభాష్‌ గుప్త, మహేశ్‌ కోనేరు, నటులు శరత్‌బాబు, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్‌ కనకాల, ప్రవీణ్, ప్రభు, భద్రం, రచ్చ రవి, హీరోయిన్‌ నటాష దోషి, సంగీత దర్శకుడు గోపీ సుందర్, ‘ఆదిత్య’ మ్యూజిక్‌ ఆదిత్య, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top