
సాయం చేసే మనసు ఉండాలే కానీ అది ఎలాగైనా, ఎన్ని రకాలుగానైనా చేయవచ్చని నిరూపిస్తున్నారు సినీనటులు. కరోనా వైరస్‌పై పోరాటంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమవంతు విరాళాలు ప్రకటించి చేతులు దులుపుకోలేదు. ఇంకా జనాలకు ఏ విధంగా సహాయపడవచ్చని పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టినదే.. "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్. ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఎందరో సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటూ పాటలతో మాటలతో అలరిస్తూ కరోనాపై చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం హీరో హృతిక్ రోషన్ అంటున్నారు ఆయన అభిమానులు. ఎందుకంటే అందరిలాగే హృతిక్ పాట పాడి వదిలేయలేదు. తనలో కొత్త కళను వెలికితీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. (కరోనా: స్టార్ హీరో ఇంటికి చేరిన మాజీ భార్య)
తను పాడే పాటకు అవసరమైన మ్యూజిక్‌ను కూడా అతనే అందించుకున్నాడు. సులువుగా చెప్పాలంటే పియానో వాయిస్తూ పాట పాడాడు. దీని కోసం ఏడు గంటలు కష్టపడ్డాడు. అతను సింగర్ కాకపోయినా, పియానో వాయిద్యకారుడు కాకపోయినా పట్టుదలతో రెండింటినీ తన సొంతం చేసుకుని అదరహో అనిపించాడు. అతని అంకితభావానికి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కరోనాపై పోరులో ముందుండి పనిచేస్తున్న వారికి సెల్యూట్ చేయడమే కాక విరాళాలు సేకరించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. (మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు!)