మౌనం వీడిన మమ్ముట్టి

How actors like Mammootty and Dileep are exposing rot of misogyny in Malayalam cinema - Sakshi

‘కసాబా’ వివాదానికి ఫుల్‌స్టాప్‌ ఎప్పుడు?
‘‘ఇంత జరుగుతున్నా మమ్ముట్టి ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆయన ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు’’... కేరళ రాష్ట్రంలో జరుగుతోన్న చర్చ ఇది. దీనికి కారణం ‘కసాబా’లో ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్‌. అసలేం జరిగిందనే విషయంలోకి వెళితే.. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ కేరళ ప్యానల్‌ మెంబర్‌గా ఉన్న కథానాయిక పార్వతి మీనన్‌  ‘కసాబా’ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసే ఉంటుంది. ఆ చిత్రంలో మమ్ముట్టి పోలీసాఫీసర్‌ పాత్రను పోషించారు. ఓ సన్నివేశంలో భాగంగా ఆయన ఒక లేడీ కానిస్టేబుల్‌ బెల్ట్‌ పట్టుకుని స్త్రీల సామర్థ్యం గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ డైలాగ్‌ గురించి పార్వతీ మీనన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – ‘‘సమాజంలో ఉన్న ప్రతి అంశాన్ని సినిమా ప్రతిబింబించేలా ఉండాలి.

స్త్రీలను తక్కువగా చిత్రీకరించటాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావించకూడదు. ఒక స్టార్‌ హీరో అటువంటి సంభాషణలు పలకటం వల్ల మిగతా వారు తప్పు దోవ పట్టే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆమె నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ వ్యాఖ్యలు మమ్ముట్టి అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. పార్వతి గురించి సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్‌›చేశారు. కొంతమందైతే ఏకంగా చంపేస్తాం, రేప్‌ చేస్తాం అంటూ బెదిరించారు. పార్వతీ మీనన్‌ వీళ్లపై పోలీసులకు కంప్లైట్‌ కూడా చేశారు. పోలీసులు కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం కనిపించడంలేదు. ఇంత జరుగుతున్నా మమ్ముట్టి ఎందుకు స్పందించడంలేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. దానికి సమాధానం దొరికేసింది.

ఫ్యాన్స్‌ని ఎంకరేజ్‌ చేయను: మమ్ముట్టి
ఎట్టకేలకు మమ్ముట్టి మౌనం వీడారు. గత కొంతకాలంగా సాగుతున్న ‘కసాబా’ డ్రామాకు తెర దించే ప్రయత్నం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ – ‘‘వివాదాల్లో భాగం కావడం నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి వేరేవాళ్ల దగ్గర నా అభిప్రాయం చెప్పడం ఇష్టం లేదు. ఆ మాటలు వేరే వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే స్వయంగా నేనే మాట్లాడుతున్నా’’ అని  ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారాయన.  ‘‘పార్వతి ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చింది. ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోవద్దని తనతో చెప్పాను.  ఇలాంటి చర్యలకు పాల్పడటానికి నా అభిమానులను ఎంకరేజ్‌ చేయను. వాక్‌ స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు తెలియజేసే హక్కు ఉంది’’ అని మమ్ముట్టి అన్నారు. మరి.. ఇప్పుడైనా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందో లేదో కాలమే చెప్పాలి.

అరెస్టయిన యువకుడికి జాబ్‌ ఆఫర్‌
ఈ కసాబా కాంట్రవర్శీలో తనను అమానుషంగా దూషిస్తున్న వారిలో కొందరి గురించి పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్‌ స్వీకరించిన పోలీసులు ప్రింటో అనే వ్యక్తిని అరెస్ట్‌ కూడా చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన ప్రింటో బెయిలు పై బయటకు వచ్చాడు. అతనికి ‘కసాబా’ నిర్మాత జాబీ జార్జ్‌ ఓ ఆఫర్‌ ఇచ్చారు. ‘‘నువ్వు ఎక్కడున్నా సరే నన్ను నా ఆఫీస్‌ లేదా ఇంట్లో కలిస్తే నేను బ్రతికున్నంత వరకూ నీ జాబ్‌ బాధ్యతలు చూసుకునే పూచీ నాది. ఇండియా, దుబాయ్, యూకె, ఆస్ట్రేలియా.. ఎక్కడ కావాలంటే అక్కడ నీకు జాబ్‌ ఇప్పిస్తా’’ అని ఫేస్‌బుక్‌ ద్వారా జాబీ జార్జ్‌ పేర్కొనడం హాట్‌ టాపిక్‌ అయింది. ఇదిలా ఉంటే.. అరెస్టుల తతంగం ఒక్క ప్రింటోతో ఆగేట్లు కనిపించడంలేదు. రోజన్‌ అనే యువకుణ్ణి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికొందరిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top