ఆ ముగ్గురి బాటలో...

Hansika Ready To Act In Thriller And Lady Oriented Movies - Sakshi

సాక్షి, చెన్నై : హన్సిక కూడా రెడీ అయిపోతోంది అనగానే ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకు వెళ్లిపోతున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఈ ముంబై బ్యూటీ నోట ఇంకా పెళ్లి మాట రానే లేదులెండి. మరి దేనికి రెడీ అవుతోందనేగా మీ ఆసక్తి. థ్రిల్లర్‌ కథా చిత్రానికండి. నయనతార, అనుష్క, త్రిష బాటలో పయనించడానికి సిద్ధం అవుతోంది హన్సిక. అవును హన్సిక కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించబోతోంది. ఈ అందగత్తె ఇప్పుటి వరకూ అభినయంతో కూడిన గ్లామరస్‌ పాత్రలోనే నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

అరణ్మణై–2 చిత్రంతో హర్రర్‌ పాత్రను కూడా రక్తి కట్టించారు. అయితే థ్రిల్లర్‌ కథా చిత్రాల్లో నటించలేదు. అదేవిధంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో కూడా ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది ఇప్పుడా అవకాశం హన్సికను వరించింది. మసాలా పడం, భోగన్, రోమిమో జూలియట్‌ వంటి చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేసిన యూఆర్‌.జమీల్‌ మెగాఫోన్‌ పడుతున్న చిత్రంలో హన్సిక కథానాయకిగా సెంట్రిక్‌ పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి సమయంలో కథనంతా తన భుజస్కంధాలపై మోసుకెళ్లే చిత్రంలో నటించే అవకాశం రావడం విశేషమే.

ఈ చిత్రం వివరాలను దర్శకుడు జమీల్‌ తెలుపుతూ హన్సికను దగ్గరుండి చూసిన తనకు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కథానాయకి పాత్రకు తనే కరెక్ట్‌గా నప్పుతుందనిపించిందన్నారు. కథ చెప్పగానే హన్సిక వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుటి వరకూ పోషించనటువంటి వైవిధ్యభరిత పాత్రలో హన్సికను ప్రేక్షకులు చూస్తారన్నారు.

మహిళలు తమ కష్టాల నుంచి బయట పడడానికి ఏం చేస్తారన్నది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఈ చిత్రంలో హన్సిక పాత్ర గురించి ప్రస్తుతానికి చెప్పలేనని, అయితే ఇందులో హన్సిక భారీ ఫైట్స్‌ను కూడా చేస్తారని, అవి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని అన్నారు. ప్రేమ, హాస్యం అంటూ జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయని, జాయ్‌స్టార్‌ ఎంటర్‌ప్రైజస్‌ సంస్థ నిర్మించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం జూలైలో సెట్‌ పైకి వెళ్లనుందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జమీల్‌ చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top