ఫీల్‌ గుడ్‌ మూవీగా సెమ | GV Prakash New Feel Good Movie Sema | Sakshi
Sakshi News home page

ఫీల్‌ గుడ్‌ మూవీగా సెమ

May 24 2018 8:22 AM | Updated on May 24 2018 8:22 AM

GV Prakash New Feel Good Movie Sema - Sakshi

సెమ చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: నాకు పెళ్లి కూతురుని కుదర్చడం కోసం పడే పాట్లే సెమ చిత్రం అని అన్నారు నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం సెమ. దర్శకుడు పాండిరాజ్‌ పసంగ ప్రొడక్షన్స్, పి.రవిచంద్రన్‌ లింగా భైరవి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. ఇందులో జీవీకి జంటగా అర్తన నటించగా యోగిబాబు  ముఖ్యపాత్రల్లో నటించారు. పాండిరాజ్‌ శిష్యుడు వల్లికాంత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న  జీవీ.ప్రకాశ్‌కుమార్‌ మాట్లాడుతూ సెమ పూర్తిగా వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు.

సాధారణంగా సినిమాల్లో హీరోలు పనీ పాటా లేకుండా తిరుగుతుంటారన్నారు. అయితే సెమ చిత్రంలో హీరో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారన్నారు. చేపలను అమ్మడానికి వెళతాడని, అవి అమ్ముడు పోకపోతే ఎండ బెట్టి మరుసటి రోజు వాటినే మళ్లీ అమ్ముతాడన్నారు. ఇలా చాలా హుషారుగా ఉండే పాత్ర అది అని చెప్పారు. హీరోకు వధువును చూసే సన్నివేశాలు చాలా వినోదంగా ఉంటాయన్నారు. నాలుగైదు పెళ్లి చూపులకు వెళ్లినా సెట్‌ కాదని, ఆ తరువాత ఒక అమ్మాయి ఓకే అయినా ఆ పెళ్లి జరగదని, అందుకు కారణాలు ఏమిటి, చివరికీ హీరో పెళ్లి జరిగిందా? లేదా? అన్న పలు జాలీ సన్నివేశాలతో కూడిన చిత్రంగా సెమ ఉంటుందని చెప్పారు. ఇది కమర్షియల్‌ అంశాలతో కూడిన మంచి ఫీల్‌ గుడ్‌ మూవీగా ఉంటుందని జీవీ పేర్కొన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ స్టెర్‌లైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో ప్రజలు పోరాడుతూ తుపాకీ గుళ్లకు బలవుతున్న సమయంలో ఈ చిత్ర సమావేశాన్ని నిర్వహించడం బాధగా ఉందన్నారు. పోరాటం ప్రజల హక్కు అని, దాన్ని పోలీసులు అణచి వేసే ప్రయత్నం, పోరాటంలో పాల్గొన్నవారిని కాల్చి చంపడం ఖండించదగ్గ విషయంగా జీవీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement