నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి | Guna 369 Pre Release Function In Hyderabad | Sakshi
Sakshi News home page

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

Jul 31 2019 3:28 AM | Updated on Jul 31 2019 8:13 AM

Guna 369 Pre Release Function In Hyderabad - Sakshi

‘‘ఆదిత్య 369’ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవ హరించాను. ‘గుణ 369’ ప్రారంభోత్సవం రోజున స్క్రిప్ట్‌ను నా చేతులతోనే ఇప్పించారు. లైట్‌ బాయ్‌ నుంచి నిర్మాత వరకు ఒళ్లు దాచుకోకుండా పనిచేసే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే’’ అని ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ, అనఘ జంటగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ‘‘యజమాని బావుంటే పనిచేసేవాళ్లు బావుంటారు. నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటాను. ట్రైలర్‌ చూస్తుంటే ‘గుణ 369’ క్వాలిటీ తెలుస్తోంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘అర్జున్‌ని నా బ్రదర్‌లా భావిస్తాను. తను డైరెక్టర్‌ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనిల్, ప్రవీణ, తిరుమల్‌ రెడ్డి నాకు ఎంతో కావాల్సిన వాళ్లు. సినిమా చూశాను. ఎంతో విలువలతో చేశారు. సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు. అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘నేను ఎంత బావుండాలని మా నాన్నగారు కోరుకుంటారో మా గురువు బోయపాటిగారు కూడా అంతే కోరుకుంటారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బాలుగారికి  ధన్యవాదాలు.

మంచి సినిమా చేశాం.. సినిమా చూసిన ప్రేక్షకులు బాగా లేదని మాత్రం చెప్పరు’’ అన్నారు. ‘‘ఓ సాధారణ వ్యక్తి జీవితకథే ఈ చిత్రం. మిమ్మల్ని (ప్రేక్షకులు) మీరు తెరపై చూసుకుంటారు’’ అన్నారు ప్రవీణ కడియాల. ‘‘మంచి కథ, కథనంతో సాగే సినిమా ఇది. ఎక్కడా  ఇది మా తొలి సినిమా అనే భావన రాలేదు’’ అన్నారు తిరుమల్‌ రెడ్డి. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ పూర్తి చేసిన తర్వాత సినిమా హిట్‌ అయిపోతుందని నేను ప్రిపేర్‌ కాలేదు. హిట్‌ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాలేదు. మనకు తెలిసిన మేర కొన్ని కథలను ఎంచుకుంటాం. అర్జున్‌ చెప్పిన కథ వినగానే సినిమా చేస్తున్నామని చెప్పాను. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందో.. స్టార్‌ డమ్‌ తెస్తుందనో కాదు... నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా కావడంతో నాకు స్పెషల్‌ మూవీగా భావించాను. అర్జున్‌తో పనిచేస్తుంటే ప్రతి సెకనుకి 100 కోట్ల లాటరీ తగులుతున్నట్లు అనిపించింది. అంత కిక్‌ ఇచ్చింది. ‘గుణ 369’ హిట్‌ కావాలని అర్జున్‌ కంటే బాగా కోరుకున్న బోయపాటిగారికి స్పెషల్‌ థ్యాంక్స్‌ గుణ పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. అనఘ, నిర్మాతలు వల్లూరిపల్లి రమేశ్, కిరణ్, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతన్‌ భరద్వాజ్, ‘మా’ అధ్యక్షుడు నరేశ్, విష్ణు ఇందూరి, నటి సంజనా తదితరులు మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement