
డీజేగానే ఈజీ!
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ ఈ శుక్రవారంవిడుదలవుతోంది
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ ఈ శుక్రవారంవిడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో స్మాల్ చిట్‌చాట్!
► తొలిసారి బ్రాహ్మణ యువకుడి పాత్ర చేశారు.. ఎలా అనిపించింది?
దర్శకుడు హరీష్ శంకర్ బ్రాహ్మణ యువకుడి కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి కథ. అతను ఈ పాత్ర గురించి చెప్పాక బ్రాహ్మణ యువకుల శైలిని గమనించడం మొదలుపెట్టాను. అంతకు ముందు ఎప్పుడూ నేనంతగా వాళ్లను గమనించిన సందర్భాలు లేవు. ఈ సినిమాకి కొంచెం హోమ్‌వర్క్ చేశా.
► ప్రతిరోజూ మా ఇంటికి పురోహితులు వచ్చేవారని ‘డీజే’ ఆడియోలో మీ డాడీ చెప్పారు. వాళ్ల దగ్గర్నుంచి మీరేం నేర్చుకున్నారు?
నాకు అంతకుముందు బ్రాహ్మణుల సంప్రదాయాల గురించి ఐడియా లేదు కాబట్టి... వాళ్ల కల్చర్ ఏంటి? వాళ్లలో ఎన్ని రకాలున్నారు? అనే సంగతులు తెలుసుకున్నా. విష్ణువును పూజించేవాళ్లు కొందరు, శివుణ్ణి పూజించేవాళ్లు కొందరు, మధ్వాచార్యులను అనుసరించేవాళ్లు కొందరు... ఇలా బ్రాహ్మణుల్లో చాలామంది ఉన్నారు. ‘డీజే’లో నేనెలాంటి బ్రాహ్మణుడి పాత్ర చేస్తున్నాననేది తెలుసుకున్నా. నా క్యారెక్టరైజేషన్‌ను ఎక్కువ డిఫైన్ చేయడం కోసం, సినిమాలో మరికొంత భాగం కోసం వాళ్లతో మాట్లాడి తెలుసుకున్నా.
► బ్రాహ్మణ యువకుడి పాత్రను ఓ నాన్–బ్రాహ్మిణ్ చేసినప్పుడు యాస, భాషల విషయంలో కేర్ తీసుకోవాలి. మీరెంత వరకు ఈ పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నారు?
మా దర్శకుడు బ్రాహ్మిణ్ కాబట్టి ఆయనకు ఓ సై్టల్ ఉంటుంది కదా! మ్యాగ్జిమమ్ ఆయన సై్టల్‌ను వాడుకుని నటించా. వంద శాతం పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించా. సినిమా చూసిన తర్వాత నేనెలా చేశాననేది ప్రేక్షకులే చెప్పాలి.
► దువ్వాడ జగన్నాథమ్, డీజే... ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు కదా! మీకు ఏది ఈజీ?
తప్పకుండా డీజేగానే ఈజీ. దువ్వాడ జగన్నాథమ్‌గా చేయడానికి కొంచెం కష్టపడ్డా. నాకు అలవాటు లేని యాస కదా. అందువల్ల, డైలాగులు చెప్పేటప్పుడు వాటితోపాటు యాసను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పాలి కాబట్టి కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోయిన్‌తో ఓ సీన్ అయితే ఎంతసేపటికీ కరెక్ట్‌గా కుదరలేదు. దానికి ఎక్కువ టేకులు తీసుకున్నా.
► సాధారణంగా ఫైట్స్‌లో ఎక్కువగా గ్రాఫిక్స్ వాడతారు. ఈ సినిమాలోని ఓ పాటలో గ్రాఫిక్స్ వాడారట?
కొత్తగా ఉంటుంది కదా! ఫస్ట్‌టైమ్ ఫైట్స్‌లో గ్రాఫిక్స్ వాడినప్పుడు... ‘ఫైట్స్‌లో గ్రాఫిక్స్ ఏంటి?’ అన్నారు. ఓ కొత్తవిషయం వచ్చినప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా సహజమే కదా!
► ఇది పక్కా కమర్షియల్ సినిమానా? ఏదైనా ఎక్స్‌పరిమెంట్ చేశారా?
సినిమా అంటేనే ఎక్స్‌పరిమెంట్! ‘డీజే’ పక్కా కమర్షియల్ సినిమా. కామెడీ, యాక్షన్, సాంగ్స్... కమర్షియల్ ప్యాకేజ్‌తో వస్తున్న సినిమా. అయితే ఓ చిన్న సందేశం కూడా ఉంటుంది.