
మట్టపర్రులో సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో సుకుమార్
మలికిపురం : ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం మట్టుపర్రుకు వచ్చారు. ఇక్కడే కుటుంబసభ్యులు, బంధువులతో సంక్రాంతి జరుపుకుంటున్నారు. వారితో కలిసి సరదాగా గడిపారు. సంక్రాంతి సందర్భంగా శంకరగుప్తం వచ్చిన జబర్దస్త్ ఫేం మహేష్, సుకుమార్ ఇంటికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అల వైకుంఠపురములో చిత్రం విజయవంతంతో ఫామ్‌లో ఉన్న నటుడు అల్లు అర్జున్‌తో తాను తీస్తున్న చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నెల నుంచి పూర్తి స్థాయిలో జరనుందని అన్నారు.
అల్లు అర్జున్‌తో మొదలైన షూటింగ్‌లో నాల్గు రోజులు చిత్రీకరణ జరిగిందన్నారు. కాగా మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త బ్యానర్‌పై సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవతేజ్ కథానాయకుడిగా నిర్మిస్తున్న ‘ఉప్పెన’ చిత్రం చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యిందని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. బుచ్చిబాబు అనే కొత్త దర్శకుడితో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి అనే నూతన నటిని పరిచయం చేస్తున్నామన్నారు. జీఏ–2 అనే సంస్థతో కలసి తమ సుకుమార్ రైటింగ్ సంయుక్త బ్యానర్‌లో కుమారి 21 సినిమా దర్శకుడు ప్రతాప్‌తో నిఖిల్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఇది త్వరలో చిత్రీకరణకు వెళుతుందన్నారు.