ఆవిరి ఐడియా అలా వచ్చింది

Director Ravi Babu speech about Aviri Movie - Sakshi

‘‘హారర్‌ జానర్‌లో రకాలు ఉన్నాయి. ‘ఆవిరి’ హారర్‌ మూవీ కాదు. మంచి ఫ్యామిలీ బేస్డ్‌ థ్రిల్లర్‌. గతంలో నేను చేసిన ‘అవును, అనసూయ’ చిత్రాలు కూడా థ్రిల్లర్‌ మూవీసే. హారర్‌ కాదు. ప్రేక్షకులను భయపెడితే థ్రిల్‌ ఫీల్‌ అవుతారని నేను అనుకోను’’ అని దర్శక–నిర్మాత, రచయిత రవిబాబు అన్నారు. నేహా చౌహాన్, రవిబాబు, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్‌ ఖాన్‌ ప్రధాన తారాగణంగా రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆవిరి’. నవంబరు 1న ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రవిబాబు చెప్పిన విశేషాలు.

► నేను, ‘దిల్‌’ రాజుగారు ఎప్పట్నుంచో మంచి మిత్రులం. ఆయన నిర్మించిన ‘బొమ్మరిల్లు’ నాకు చాలా ఇష్టం. మేం ఇద్దరం ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ‘ఆవిరి’ సినిమాతో కుదిరింది. ఈ సినిమా తీయడానికి ముందు ‘దిల్‌’ రాజుగారికి కథ చెప్పాను. సినిమా పూర్తయ్యాక చూపిస్తే, బాగుందన్నారు. నేను ఎవరితో సినిమా తీసినా ఫస్ట్‌ కాపీ పూర్తయ్యేవరకు బాధ్యత తీసుకుంటాను.

► ‘అదుగో’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ సమయంలో నెక్ట్స్‌ ఏ చిత్రం చేయాలి? అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి ఇంట్లో ఓ స్పిరిట్‌ ఉందన్న వార్తలు చదివాను. ఈ ఐడియాకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘ఆవిరి’ కథ రాసుకున్నాను. ‘అదుగో’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉండటంతో కొన్ని సినిమాల్లో నటించలేకపోయా. ‘సాహో’ వదులుకున్నాను. మళ్లీ నటుడిగా బిజీ అవుతా.
► భారీ బడ్జెట్‌ సినిమాలు తీయడం కంటే కొత్త ఐడియాలతో ప్రేక్షకుల మెప్పు పొందడమే గొప్పగా  భావిస్తాను. ఇప్పటివరకు నేను ప్రయత్నించిన జానర్‌లు ఎవరూ ప్రయత్నించి ఉండరు. ∙నా దగ్గర నాలుగైదు ఐడియాలు ఉన్నాయి. వాటిలో ఓ ముసలాయన పాత్ర ఆధారంగా ఓ కథ ఉంది. అక్కినేని నాగేశ్వరరావుగారు బతికి ఉండి ఉంటే ఆయన్ను ఈ క్యారెక్టర్‌ చేయమని రిక్వెస్ట్‌ చేసేవాడిని.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top