జేమ్స్‌బాండ్ పక్కన మనోళ్ళు? | Deepika Padukone, Priyanka Chopra in the race for the next Bond girl? | Sakshi
Sakshi News home page

జేమ్స్‌బాండ్ పక్కన మనోళ్ళు?

May 10 2016 10:48 PM | Updated on Sep 3 2017 11:48 PM

జేమ్స్‌బాండ్ పక్కన మనోళ్ళు?

జేమ్స్‌బాండ్ పక్కన మనోళ్ళు?

ఇవాళ హాలీవుడ్‌లోనూ మన దేశం జెండా ఎగరేస్తున్న అందాల తారలంటే - ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే.

 ఇవాళ హాలీవుడ్‌లోనూ మన దేశం జెండా ఎగరేస్తున్న అందాల తారలంటే - ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే. వీరిద్దరూ ఇప్పుడు తమ తమ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో అమెరికాలో బిజీగా ఉన్నారు. ఒకపక్క దీపిక ‘ఎక్స్ ఎక్స్ ఎక్స్ - ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లో ఛాన్స్‌తో అందరి దృష్టీ ఆకర్షిస్తున్నారు. మరోపక్క ప్రియాంకా చోప్రా ‘బే వాచ్’లో విలన్ తరహా పాత్ర దక్కించుకొని, సంచలనం రేపారు.

 ఇలా భారతీయ సినిమా ఖ్యాతిని హాలీవుడ్ దాకా తీసుకెళ్ళిన ఈ దేశీ భామలు ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో గర్వకారణం కానున్నారా? జేమ్స్‌బాండ్ సిరీస్‌లో తీసే కొత్త చిత్రంలో జేమ్స్‌బాండ్ ప్రియురాలి పాత్రకు వీరిద్దరిలో ఒకరిని తీసుకోవాలనే ఆలోచన సాగుతోందట! జేమ్స్‌బాండ్ సిరీస్‌లోని తాజా చిత్రం ‘స్పెక్టర్’ గత ఏడాదే జనం ముందుకొచ్చి, విజయం సాధించింది.
 
 గడచిన కొన్ని సినిమాలుగా జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తూ వచ్చారు. అయితే, వచ్చే కొత్త బాండ్ సినిమాలో ఆయన స్థానంలో ఎవరు బాగుంటారా అని దర్శక, నిర్మాతలు వెతుకుతున్నారు. పనిలోపనిగా కొత్త జేమ్స్‌బాండ్‌కి కొత్త ప్రేయసిని కూడా అన్వేషిస్తున్నారట. ఆ పాత్ర కోసం మన దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రాలు కూడా బరిలో ఉన్నారు. ‘‘దీపిక ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్...’ షూటింగ్ ఆఖరి దశలో పాల్గొంటున్నారు. ఇక, ప్రియాంకా చోప్రా అయితే గత ఏణ్ణర్ధంగా ‘క్వాంటికో’ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇటీవలే ‘బే వాచ్’లో కూడా నటించడం మొదలుపెట్టారు.
 
 ఈ ఇద్దరి తారలకూ డేట్లు, వర్క్ షెడ్యూల్స్‌ను నేర్పుగా నిర్వహించేందుకు బలమైన బృందాలు ఉన్నాయి. ఆ బృందాలు వీళ్ళను తీసుకొని, వివిధ హాలీవుడ్ స్టూడియోల చుట్టూ తిప్పుతున్నారు. చిన్నాచితకా పాత్రలు, వట్టి అందాల ఆరబోత పాత్రలు చేయడం తమకు ఇష్టం లేదని ఈ ఇద్దరు తారలూ తమ ఏజెంట్స్‌కు చెప్పేశారు. కాబట్టి, ఈ కొత్త బాండ్ గర్ల్ పాత్రకు వీరిద్దరూ మంచి పోటీదారులే’’ అని ఆంతరంగిక వర్గాల కథనం. మొన్నటి ‘స్పెక్టర్’ సినిమాలో ముగ్గురు బాండ్ గర్ల్స్ కనువిందు చేశారు. మరి, రానున్న బాండ్ ఫిల్మ్‌లో ఆ అదృష్టం మన దీపిక, ప్రియాంకల్లో ఎవరికైనా దక్కుతుందేమో చూడాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement