
నాతో సినిమానా? అయితే... రాజీ పడాలి!
ఎవరైనా సరే నాతో సిన్మా తీయాలని అనుకుంటే... నా దగ్గరకు రావడానికి ముందే నాతో ఉన్న సమస్యలను...
ఎవరైనా సరే నాతో సిన్మా తీయాలని అనుకుంటే... నా దగ్గరకు రావడానికి ముందే నాతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కాజోల్ అంటున్నారు. బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆదిత్యా చోప్రా, కరణ్ జోహార్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె ఈ విధంగా స్పందించారు. బాలీవుడ్‌లో బడా దర్శక–నిర్మాతలైన వీళ్లిద్దరూ ఆమెతో గొడవపడ్డారా? అనడిగితే లేదనే చెప్పాలి. మరి, సమస్య ఏంటి? అంటే... కాజోల్ భర్త అజయ్ దేవగన్‌కు వాళ్లిద్దరితో గొడవలున్నాయి. యశ్ చోప్రా (ఆదిత్య తండ్రి) దర్శకత్వం వహించిన చివరి సిన్మా ‘జబ్ తక్ హై జాన్’, అజయ్ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సర్దార్’ సిన్మాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అప్పుడు థియేటర్ల విషయంలో గొడవలు వచ్చాయి.
అజయ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘శివాయ్’, కరణ్ దర్శకత్వం వహించిన ‘యే దిల్ హై ముష్కిల్’ ఒకే రోజున ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక్కడా సేమ్ ప్రాబ్లమ్. దాంతో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి క్లాసిక్‌లో చోటిచ్చిన ఆదిత్యా చోప్రా, ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్’ వంటి మంచి సిన్మాల్లో ఛాన్స్ ఇచ్చిన కరణ్ జోహార్‌ల ఫ్రెండ్‌షిప్‌కి కాజోల్ కటీఫ్ చెప్పక తప్పలేదు. అప్పట్నుంచి వీళ్ల మధ్య మాటల్లేవ్. ఒకవేళ వాళ్లిద్దరూ మళ్లీ అటువంటి సిన్మాలు, పాత్రలతో మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? అనడిగితే... ‘‘ఎవరైనా సరే నాతో సిన్మా తీయా లనుకుంటే... ముందు మా ఆయనతో రాజీ పడాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి’’ అన్నట్టు కాజోల్ మాట్లాడుతున్నారు. ఏం జరుగు తుందో? వెయిట్ అండ్ సీ.