విశ్వనాథ్‌గారి క్లైమాక్స్‌ గుర్తుకొస్తోంది | Sakshi
Sakshi News home page

విశ్వనాథ్‌గారి క్లైమాక్స్‌ గుర్తుకొస్తోంది

Published Sat, Jul 14 2018 1:11 AM

Chiranjeevi congratulates Vijetha team - Sakshi

‘‘నేను నటించిన ‘విజేత’ టైటిల్‌తో వస్తున్న సినిమా కావడం, కల్యాణ్‌ నటించడంతో ఈ ‘విజేత’ సినిమాపై నాకు ఉత్సాహం, క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేది. సినిమా చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యా. సినిమా చూస్తున్నంత సేపు నన్ను నేను మరచిపోయా’’ అని హీరో చిరంజీవి అన్నారు. కల్యాణ్‌ దేవ్, మాళవికా నాయర్‌ జంటగా రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని హీరో చిరంజీవి వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన ‘విజేత’ టీమ్‌ని అభినందించి, విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా ఇమేజ్‌ని మార్చి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సినిమా ‘విజేత’. ఇప్పుడు ఈ ‘విజేత’ కూడా కుటుంబ విలువలు, తల్లిదండ్రులు–పిల్లల మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత, వాళ్ల బాధ్యతలు ఎలా ఉండాలో చెప్పింది. నేటి యువత వేరే ఆకర్షణలతో ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయడం.. తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకపోవడం.. పిల్లల భవిష్యత్తుపై పేరెంట్స్‌ వర్రీ అవుతుండటం మనం చూస్తుంటాం.

అలాంటి వారందరికీ ఈ సినిమా ఓ కనువిప్పు. కచ్చితంగా ఈ సినిమా చూడాలి. రాకేశ్‌ ‘విజేత’ని అద్భుతంగా తెరకెక్కించి నూటికి నూరు శాతం సక్సెస్‌ అయ్యాడు. మురళీశర్మ ప్రతి సీన్‌లో అత్యద్భుతంగా నటించి వావ్‌ అనిపించాడు. క్లైమాక్స్‌లో ఆయన హావభావాలు చూసి తోటి నటుడిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నా. నటుడికి న్యాయం అంటూ జరిగితే ఈ సినిమాకి ఉత్తమ క్యారెక్టర్‌ అవార్డు మురళీశర్మకి రావాలి, వస్తుందనే నమ్మకం ఉంది. తనకు మంచి భవిష్యత్తు ఉందని కల్యాణ్‌ ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ‘విజేత’కి కెమెరామెన్‌ సెంథిల్‌గారు పెద్ద ఎస్సెట్‌. సాయిగారిని చూస్తే నిర్మాత అంటే ఇలా ఉండాలనిపిస్తోంది.

సినిమా చూసి బయటికొచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు. క్లైమాక్స్‌లో హీరో, విలన్‌ అంటూ ఎవరూ ఉండరు. ఎమోషన్‌ మాత్రమే ఉంటుంది. విశ్వనాథ్‌గారి చిత్రాల్లోని క్లైమాక్స్‌ గుర్తొచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేసేటప్పుడు నేను మురళీశర్మని, యాక్టర్‌ని అనే విషయం మరచిపోయా. క్లైమాక్స్‌లో నిజంగానే ఏడ్చేశా. ఈ చిత్రాన్ని  మా నాన్నకు అంకితం చేస్తున్నా. ఆయనే నా హీరో’’ అన్నారు మురళీశర్మ. ‘‘చూసిన వారందరూ మంచి సినిమా అని అభినందిస్తున్నందుకు థ్యాంక్స్‌’’ అన్నారు రాకేశ్‌ శశి. ‘‘ఇంత మంచి కథతో నా కెరీర్‌ స్టార్ట్‌ అవ్వడం వెరీ హ్యాపీ. వారాహి బ్యానర్‌లో హీరోగా పరిచయం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కల్యాణ్‌ దేవ్‌. నిర్మాత సాయి కొర్రపాటి, కెమెరామెన్‌ సెంథిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement