ఏవీయం రాజేశ్వరికి లాక్‌

AVM Rajeshwari Theatre Permanently Closed - Sakshi

ప్రముఖ థియేటర్‌కి తాళం

చెన్నైలోని వడపళని ఏరియాలో గల ఏవీయం రాజేశ్వరి థియేటర్‌లో సినిమా చూసినవాళ్లకు ఓ చేదు వార్త. ఈ స్టూడియోకి లాక్‌ పడబోతోంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్‌.. ఆ తర్వాత శివకుమార్, జయశంకర్, ఆ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్, ఆ తర్వాత కార్తీక్, శివాజీ తనయుడు ప్రభు నుంచి ఆ తర్వాతి తరం శివకుమార్‌ తనయుడు సూర్య, అజిత్‌... ఇలా మూడు నాలుగు తరాల హీరోలతో పాటు నాలుగు తరాల హీరోయిన్లనూ చూపించిన ఈ తెరకు తెరపడనుండటం అంటే చిన్న విషయం కాదు. దివంగత లెజెండ్రీ ప్రొడ్యూసర్, ఏవీయం స్టూడియోస్‌ ఫౌండర్‌ ఏవీ మెయ్యప్ప చెట్టియార్‌ (ఏవీయం చెట్టియార్‌) తన సతీమణి ఏవీయం రాజేశ్వరి పేరు మీద ఈ థియేటర్‌ కట్టించారు. 1979లో ఆరంభమైన ఈ థియేటర్‌ నిరాటంకంగా సినిమాలు ప్రదర్శిస్తూ వచ్చింది.

చెట్టియార్‌ మరణం తర్వాత ఆయన వారసులు థియేటర్‌ నిర్వహణను చూసుకుంటున్నారు. ఇప్పుడు కోవిడ్‌ 19 కారణంగా థియేటర్లు మూతబడిన నేపథ్యంలో థియేటర్ల యజమాన్యానికి నష్టం వాటిల్లింది. మళ్లీ థియేటర్లు ఓపెన్‌ చేశాక ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం కూడా ఉంది. అందుకే ‘ఏవీయం రాజేశ్వరి’ థియేటర్‌ని పర్మినెంట్‌గా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించుకుందట. తక్కువ ధరకు టికెట్స్, మినిమమ్‌ పార్కింగ్‌ చార్జీలు, థియేటర్‌ ఫుడ్‌ స్టాల్స్‌లో తక్కువ ధరకే తినుబండారాలు.. ఇలా ఆడియన్స్‌ ఫ్రెండ్లీ థియేటర్‌గా ఏవీయంకి పేరుంది. అలాగే చెన్నై వాషర్‌మేన్‌పేట్‌లో గల మహారాణి థియేటర్‌ కూడా మూతపడనుందట. మరి.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో మరెన్ని థియేటర్లు మూతబడతాయో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top