
తమిళసినిమా: అరుంధతి చిత్రంతో ప్రత్యేక ముద్ర వేసుకుని జేజెమ్మగా అభిమానుల జేజేలు అందుకున్న నటి అనుష్క. ఆ చిత్రం తరువాత ఈ యోగా సుందరి జీవితమే మారిపోయింది. అదే వరుసలో రుద్రమదేవి, బాహుబలి వంటి చారిత్రక కథా చిత్రాల్లో అద్భుత నటనను ప్రదర్శించిన అనుష్క ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు. ఇది ఈ బ్యూటీ అభిమానులకు నిరుత్సాహానిచ్చే విషయమే. అవకాశాలు లేక, వచ్చిన వాటిని అంగీకరించక ఇలాంటి పరిస్థితి అన్న ప్రశ్నకు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ విషయమై అనుష్క నుంచి సరైన బదులు రావడం లేదు.అయితే ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం బరువు పెరిగిన ఈ బ్యూటీ ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి చాలా తంటాలే పడాల్సి వచ్చిందన్నది నిజం. ఎట్టకేలకు బరువు తగ్గి స్లిమ్‌గా తయారైందనే ప్రచారం జరుగుతోంది. అయినా ఇప్పటి వరకూ కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అయితే తను చాలాకాలంగా నటిస్తున్న భాగమతి చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసుకుంది. చిత్రాన్ని జనవరితో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరగుతున్నట్లు సమాచారం. అనుష్కను నడుము నెప్పి చాలా కాలంగా వెంటాడుతోందట. అది తగ్గడానికి పలువురు పలు రకాల సలహాలు ఇచ్చారట. కొందరు ఆయుర్వేద చికిత్స ఉత్తమమని సూచించారట.
ప్రస్తుతం అనుష్క కేరళలో నడుము నొప్పికి చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో వాస్తవం ఎంతన్నది తెలియాల్సి ఉంది.కాగా అనుష్కను అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఒక ప్రచారం జరగుతోంది. అయితే చిత్ర వర్గాలు మాత్రం హీరోయిన్ విషయంలో గోప్యం పాటిస్తున్నారు. దీంతో అనుష్క నూతన చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు.