తొంభయ్యారు.. తెలుగుకి తయారు | 96 movie remake in telugu | Sakshi
Sakshi News home page

తొంభయ్యారు.. తెలుగుకి తయారు

Sep 30 2018 3:40 AM | Updated on Sep 30 2018 8:57 AM

96 movie remake in telugu - Sakshi

దిల్‌ రాజు

సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్‌ అవ్వడం సహజం. కానీ తమిళంలో ఇంకా రిలీజ్‌ కాని ‘96’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత, నిర్మాత ‘దిల్‌’ రాజు తెలిపారు. విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ప్రేమ కథాచిత్రం ‘96’. ఈ చిత్రం అక్టోబర్‌ 4న విడుదల కానుంది. ఇందులో ఫొటోగ్రాఫర్‌ పాత్రలో విజయ్‌సేతుపతి, టీచర్‌ పాత్రలో త్రిష కనిపిస్తారట. ఆల్రెడీ ఈ సినిమాను చూసి, రీమేక్‌ రైట్స్‌ దక్కించుకున్నారు ‘దిల్‌’ రాజు.

దీంతో తెలుగు రీమేక్‌లో ఎవరు నటిస్తారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాని, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. ‘‘తమిళంలో అక్టోబర్‌ 4న విడుదల కాబోతున్న ‘96’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నాం. నటీనటులను ఇంకా ఫైనలైజ్‌ చేయలేదు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ అధికారిక ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. మరి... ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రేమికులు ఎవరో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు.

Advertisement
 
Advertisement
Advertisement