‘ముందస్తు’ హడావుడి

Preparations for panchayat elections - Sakshi

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు

బ్యాలెట్‌ బాక్సులు, సిబ్బంది వివరాల సేకరణ

కొత్త పంచాయతీలు, వార్డులపై ప్రతిపాదనలు

పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు, పంచాయతీలకు ముందస్తు ఎన్నికలు, కొత్త పంచాయతీల ఏర్పాటు వంటి వార్తల నేపథ్యంలో గ్రామ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా పంచాయతీ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సుల వివరాలపై కూడా నివేదించింది. తాజాగా ఎన్నికల సిబ్బంది వివరాలను సేకరించే పనిలో జిల్లా పంచాయతీ విభాగం నిమగ్నమైంది. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

గ్రామ పంచాయతీలకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో జిల్లా పంచాయతీ విభాగం ఎన్నికల నిర్వహణ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సుల లభ్యతపై అంచనాకు వచ్చిన పంచాయతీ అధికారులు.. ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ పంచాయతీలను సైతం దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది జాబితాలు రూపొందిస్తున్నారు. సుమారు 6300 పోలింగ్‌ స్టేషన్లకు సుమారు 7400 మంది సిబ్బంది అవసరమవుతారని ప్రాథమికంగా అంచనా వేశారు. 200 వరకు ఓటర్లు ఉన్న పోలింగ్‌ బూత్‌లో ఇద్దరు, 200 నుంచి 400 ఓటర్లు ఉంటే ముగ్గురు, 400కు పైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ బూత్‌లో నలుగురేసి చొప్పున సిబ్బంది అవసరమవుతారని లెక్కలు వేస్తున్నారు. ఈ మేరకు నాలుగో తరగతి ఉద్యోగులను మినహాయించి వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు తదితరుల వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగి పేరు, సెల్‌ నంబరు, హోదా, పని చేసే చోటు తదితర వివరాలను క్రోఢీకరిస్తున్నారు. ఈ ఏడాది జూలై 31లోగా రిటైరయ్యే ఉద్యోగులను ఈ జాబితా నుంచి మినహాయిస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా ఒకే విడతలో కాకుండా రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే కోణంలో బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సిబ్బంది జాబితాలు రూపొందిస్తున్నారు.

ఫిబ్రవరిలో ఎన్నికలు సాధ్యమేనా?
ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నాటికి ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ముగియనుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించి, వచ్చే ఆగస్టు నాటికి కొత్తగా ఎన్నికైన పాలక మండళ్లకు శిక్షణ ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటరు జాబితా ప్రచురణ, కొత్త పంచాయతీలు, వార్డుల ఏర్పాటు, రిజర్వేషన్ల ఖరారు, బ్యాలెట్ల ముద్రణ తదితర ఏర్పాట్లు ఫిబ్రవరిలోగా పూర్తి చేయడం అసాధ్యమని పంచాయతీ విభాగం వర్గాలు తేల్చి చెప్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రస్తుతం 475 పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 4718 వార్డులు ఉన్నాయి. అయితే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల సూచన మేరకు జిల్లాలో కొత్తగా 206 పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో 93 గిరిజన తండాలకు గ్రామ పంచాయతీ హోదా ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది.

మరోవైపు అమీన్‌పూర్, బొల్లారం, నారాయణఖేడ్, కోహిర్, తెల్లాపూర్‌ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ మున్సిపాలిటీలు, అందోలు–జోగిపేట నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వంటి అంశాలపై స్పష్టత వస్తేనే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానున్నది. అయితే కొత్త పంచాయతీలు, వార్డుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. మార్గదర్శకాలు మాత్రం జారీ కాలేదు. మార్గదర్శకాలు విడుదలైతేనే కొత్త పంచాయతీలకు సంబంధించిన మ్యాపులు, సర్వే నంబర్లు తదితర అంశాలు కొలిక్కి రానున్నాయి. అయితే జిల్లా పంచాయతీ విభాగం అధికారులు మాత్రం వివిధ కోణాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, నివేదికల రూపంలో క్రోఢీకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

జిల్లా జనాభా    : 12,06,996
ఎస్టీలు        : 82501
ఎస్సీలు        : 2,42,040
బీసీలు        : 4,82,510
గ్రామ పంచాయతీలు    : 475
వార్డులు        : 4718
కొత్త పంచాయతీలు    : 206 (ప్రతిపాదన)
వార్డులు        : 1626 (ప్రతిపాదన)
బ్యాలెట్‌ బాక్సులు    : 3241 (లభ్యత)
ఎన్నికల సిబ్బంది    : 7400 (అంచనా)

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top