షారుఖ్‌ ఖాన్‌కు షాక్‌: భారీ ఆస్తి గోవిందా?

Income Tax department attaches Shah Rukh Khan's Alibag farmhouse, reports - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్షా, సీనియర్‌  హీరో షారుఖ్‌ ఖాన్‌కు ఆదాయపన్ను శాఖ షాక్‌ ఇచ్చింది. షారుఖ్‌ బినామీ ఆస్తికి సంబంధించిన ప‌క్కా ఆధారాల్ని సేక‌రించిన ఐటీ శాఖ కొర‌డా ఝ‌ళిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవల ఇచ్చిన ఐటీ నోటీసులకు స్పందించడకపోవడంతో  షారూఖ్‌కు చెందిన  విలాస వంతమైన ఫాం హౌస్‌ను తాత్కాలికంగా ఎటాచ్‌ చేసింది. మహారాష్ట్ర  ఆలీబాగ్‌లోని డెజా వు ఫార్మ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎటాచ్‌ చేసింది.  ఈ మేరకు  బినామి  ఆస్తి లావాదేవీల చట్టం (పిబిపిటి) కింద అటాచ్‌మెంట్‌  నోటీసు జారీ చేయనుందని బిజినెస్‌ స్టాండర్డ్‌ రిపోర్ట్‌ చేసింది.

ఈ పరిణామాన్ని ధృవీకరించిన ఐటీ శాఖ సీనియర్‌ .. సెక్షన్‌ 24 ప్రకారం బినామీదారుడు దర్యాప్తు సంస్థ  గుర్తిస్తే  ఆ వ్యక్తికి లేదా ప్రయోజనకరమైన యజమానికి అటాచ్మెంట్ నోటీసును జారీ చేయవచ్చని తెలిపారు. ఆస్తి అటాచ్‌మెంట్ నోటీసు జారీ చేసిన  90రోజుల  తరువాత  సదరు ఆస్తిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చట్టం పేర్కొందన్నారు.  దీనికి సంబంధించి డిసెంబర్‌లోనే నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.  19,960 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి విలువ (సర్కిల్‌ రేటు)  సుమారు. రూ. 146.7 మిలియన్లు(15 కోట్లు)  అయితే మార్కెట్‌  ధర దీనికి ఐదు రెట్లు పెరగనుందని మరో ఐటి అధికారి చెప్పారు.  ఇందులో బీచ్,  స్విమ్మింగ్‌పూల్‌ తోపాటు, ప్రైవేట్ హెలిప్యాడ్ లాంటి సౌకర్యాలు  ఈ ఫాం హౌస్‌లో ఉన్నాయట.

కాగా కొన్నేళ్ల కింద‌ట షారుఖ్‌ సుమారు  20,000 గ‌జాల ఈ భూమిని వ్య‌వ‌సాయం కోసం  చేజిక్కించుకున్నాడు. అయితే దీనిని అందుకోసం ఉప‌యోగించ‌కుండా.. ఒక ఫామ్‌హౌస్‌ నిర్మించడంతోపాటు,  బంధువుల్ని డైరెక్ట‌ర్లుగా నియ‌మించి స‌ర్వాధికారాల్ని తానే క‌లిగి ఉన్నాడు.  దీని  మార్కెట్‌  విలువ సుమారు 100 కోట్ల  రూపాయల మేర ఉంటుంద‌ని అంచ‌నా వేస్తోంది ఐటీ శాఖ‌.  కింగ్ ఖాన్‌ నేరం రుజువైతే ఆరు నెలలనుంచి ఏడేళ్ల దాకా శిక్ష, ఆస్తిలో 10 శాతం మేర  జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.  అయితే  ఈ పరిణామంపై షారుఖ్‌ ఖాన్‌ ఇంకా  స్పందించాల్సి ఉంది.
 

Read latest Market News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top