సాగులో సగం

special story on women empowerment farmer womens - Sakshi

వ్యవసాయంలో రాణిస్తున్న సీత–మంగమ్మ

పదిహేనేళ్ల క్రితం భర్త కనుమూసినా సాగులోనే..

కడదాకా కలిసుంటానన్న మగ దిక్కు మధ్యలో ‘కాడి’ దింపేశాడు. అప్పులు బాధతో కొందరు, అనారోగ్యంతో మరికొందరు భార్య, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కొంతకాలం ఆ మహిళలు దిక్కుతోచని స్థితి ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వారికి పిల్లల పోషణ, చదువులు, కుటుంబ భారం గుర్తుకొచ్చింది! ఇంకేం భర్త దించిన ‘కాడి’నే ఎత్తుకున్నారు. కుటుంబానికి ఇంతకాలం అండగా ఉన్న, తాము నమ్ముకున్న భూమిలో వ్యవసాయం ఆరంభించారు. నష్టాలు వచ్చాయ్‌.. లాభాల్ని కళ్ల జూశారు.. అయినా ఎక్కడా ఆ ‘మహిళా మణులు’ తమ ధైర్యాన్ని కోల్పోలేదు. సాగులో ముందుకు సాగుతూ పిల్లలను ప్రయోజకుల్ని చేస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి మహిళల్లో కొందరి కథనాలు..

కౌలు భూముల్లో వ్యవ‘సాయం’
మహబూబ్‌నగర్‌, గట్టు: మండలంలోని సల్కాపురం గ్రామానికి తూము రాములమ్మ భర్త నర్సప్ప 12 ఏళ్ల క్రితం చెరువులో మృతదేహమై తేలాడు. అప్పటికి ఈ కుటుంబానికి ఎకరా పొలం మాత్రమే ఉంది. అదీ కూడా వర్షాధారంగా పం టలు పడే భూమి. భర్త ఉన్న రోజుల్లో  సేద్యం పనులు ఆయనే చూసుకునే వాడు. అయితే, ఆయన మృతితో నలుగురు పిల్లల భారం ఆమెపై పడింది. అప్పుడు కూలీ పనులు చేస్తూ ఆమె పిల్లలను పెంచసాగింది. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల చదువు మాత్రం మాన్పించలేదు. ఆ తర్వాత ఎకరం పొలం కౌలుకు తీసుకుని పత్తి, పొగాకు సాగు చేయసాగింది. పిల్లల్లో ఓ కుమార్తె మంగమ్మ వివాహం జరిపించగా, ఓ కుమారుడు తిమ్మప్ప తల్లికి వ్యవసాయ పనుల్లో అండగా ఉంటున్నాడు. మిగతా వారిలో గోవిందు 9వ తరగతి, హైమావతి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడుతూ ఎకరం పొ లం కౌలు తీసుకుని సాగు చేస్తూనే.. ఖాళీ సమయాల్లో పక్క పొలాల్లో కూలీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తనలా పిల్లలు కావొద్దనే భా వనతో చదివిస్తున్నట్లు వెల్లడించారు.

‘మగ’రాణులు
మహబూబ్‌నగర్‌, గోపాల్‌పేట: వ్యవసాయం చేయడంలో మగవారికి సాటి ఎవరూ రారని అనుకుంటారు. కానీ వ్యవసాయంలో సాయంగానే ఉన్న వారిద్దరూ భర్త మృతి చెందాక సొంతంగా మగ వారికి ధీటుగా వ్యవసాయ రంగంలో రాణిస్తూ అందరి చేత ‘మగ’ రాణులు అనిపించుకుంటున్నారు సీత, మంగమ్మ. గోపాల్‌పేట మండలం బుద్దారం పంచాయతీ పరిధి జాంప్లాతండాకు చెందిన కాట్రావత్‌ గోపాల్‌కు మొదటి భార్య మంగమ్మ. ఈమెకు సంతానం లేకపోవడంతో సీతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మంగమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు, సీతకు ఒక కొడుకు జన్మించారు. అప్పటి నుంచి గోపాల్‌ తనకున్న 10 ఎకరాల పొలంపై ఆధారపడి తల్లిదండ్రులు లచ్యా, దేవ్లీతో పాటు కుటుంబాన్ని పోషిస్తుండగా.. పిల్లల చిన్న వయస్సులో 16 ఏళ్ల క్రితం గోపాల్‌ అనారోగ్యంతో మరణించాడు. తొలుత ఏం చేయాల్లో దిక్కుతోచక సీత, మంగమ్మ మనో వేదనకు గురయ్యారు. వారిద్దరూ పనుల కోసం ముంబై వెళ్తారని అందరూ భావించినా.. భర్త మరణం తర్వాత బీడు పడిన పొలాన్ని బాగు చేసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకుని పిల్ల లను అత్తామామల పర్యవేక్షణ ఉంచి ముం దుకు సాగారు. వ్యవసాయం చేసుకుంటు పిల్లలను చదివించడం ప్రారంభించారు. 

బోర్లు ఎండిపోయినా..
ఏటా సీత, మంగమ్మ తమ పొలంలో మొక్క జొన్న, వేరుశనగ, వరి పండిస్తుండగా.. ఉన్న బోరు ఎండిపోవడంతో వరుసగా నాలుగేళ్లు నాలుగు బోర్లు వేయించిన నీళ్లు పడలేదు. అయినా మొక్కువోని ధైర్యంతో ప్రస్తుతం యాసంగిలో నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. రూ.లక్ష ఖర్చు పెట్టి కిలోమీటర్‌ దూరం నుంచి పైప్‌లైన్‌ ద్వారా చెక్‌డ్యాం నుంచి పంటకు నీళ్లందిస్తున్నారు. ఇక పిలల్లు తమలా కావొద్దని చదివిస్తుండగా.. మంగమ్మ పెద్ద కొడుకు కురుమూర్తి డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. రెండో కుమారుడు చందు ఏడో తరగతి పూర్తయ్యాక హైదరాబాదులో ఆటో నడుపుతున్నాడు. కూతురు శారద వనపర్తిలోని మరికుంట గురుకులంలో ఇంటర్‌ చదువుతుండగా, సీత కొడుకు రాజు బుద్దారం హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం రానున్న పిల్లలను ప్రయోజకులను చేయాలన్న తపన వారిలో కనిపిస్తుంది.  

భర్త చనిపోయినా ఆగని కాడి
నాగర్‌కర్నూల్‌ రూరల్‌: ఎప్పుడో 22 ఏళ్ల క్రితం తన భర్త పాముకాటుతో మరణించాడు. అప్పుడు ఆమె చేతిలో నాలు గో తరగతి చదువుతున్న బాబుతోపాటు మరో బాబు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వ్యవసాయం చేస్తూ తన పిల్లలను ఉన్నత చదువులకు పంపించింది నియోజకవర్గంలోని రాయిపాకులకు చెందిన వేనేపల్లి సులోచనమ్మ. ప్రస్తుతం పెద్ద కుమారుడు విజయేందర్‌  ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసి చైనాలోని సైన్స్‌ జిన్‌టెక్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టరేట్‌ ఫెలోషిప్‌ చదివేందుకు సీటు సాధించాడు. పెద్ద కుమార్తెను డిగ్రీ వరకు చదివించాక ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి చేయగా, ఇటీవలే చిన్న కుమారుడు, చిన్న కుమార్తెకు కూడా వివాహం జరిపించింది. పిల్లలు ప్రయోజకులైనా తాను నమ్ముకున్న వ్యవసాయాన్ని మాత్రం సులోచనమ్మ కొనసాగిస్తుండడం విశేషం.

వ్యవసాయం.. ఆమెకు ప్రాణం
మదనాపురం: చిన్నప్పటినుండి అనేక రకాల పంటలు పండిస్తూ భూమినే నమ్ముకున్న మదనాపురం మండలం గోవిందహల్లికి చెందిన గౌనికాడి చెన్నమ్మ పలువురికి ఆదర్శంగా నిలుస్తోం ది. భర్త నాగన్న, కొడుకుల సహకారంతో తమకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఏటా ప్రకృతి సహకరించిన, సహకరించకపోయి నా ముందుకు సాగుతోంది. ఉదయాన్నే పొలానికి వెళ్లి పంటలకు నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువుల చల్లడంతో పాటు ఇంటి దగ్గర ఉన్న గేదెకు మేత తీసుకురావడం, పాలు పితకడం వరకు అన్ని పనులు చెన్నమ్మ సజావుగా చేస్తుండడం విశేషం. ఇక పంటలకు ఏదైనా రోగాలు వస్తే ప్రమాదాన్ని గుర్తించి అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తుండడంతో నష్టాలు రావడం లేదు. ఈ సందర్భంగా చెన్నమ్మ మాట్లాడుతూ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుండి తనకు ప్రాణమని, వివాహమైన తర్వాత కూడా తన భర్తకు ఉన్న పొలంలో వ్యవసాయం సాగిస్తున్నానని తెలిపారు. సమయం దొరికినప్పుడల్లా గ్రామంలో వేరే రైతుల పొలాల్లో పనులు చేస్తానని పేర్కొంది. పండించడంలో ఉన్న ఆనందం ఎందులోనూ దక్కదని, ఒక్క రోజు పొలానికి వెళ్లకున్నా మనస్సుకు వెలితిగి ఉంటుందని తనకు పొలంపై ఉన్న ప్రేమను ఆమె తెలియజేసింది.

కష్టాలకు ఎదురీదిన రాజేశ్వరమ్మ  
మరికల్‌: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త కాన్సర్‌ వ్యాధితో బాధ పడుతూ మృతి చెందాడు.. పుట్టెడు దుఖాన్ని దిగమిగుతూ చేతికోస్తున్న పిల్లలను ఉన్నత చదువులను చదివించేందుకు భర్త చూపిన దారినే ఎన్నుకుంది. వ్యవసాయ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది మరికల్‌ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరమ్మ. అంజిల్‌రెడ్డి–రాజేశ్వరమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. వీరికి పది ఎకరాల పొలం వుంది. అంజిల్‌రెడ్డి ఐదేళ్ల క్రితం కేన్సర్‌ బారిన పడడంతో చికిత్స రూ. 8 లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో అటు భర్త వైద్యం కోసం చేసిన అప్పులు.. ఇటు పిల్లల పోషణ భారం ఒకేసారి మీద పడగా ధైర్యాన్ని కూడగట్టుకున్న ఆమె భర్త చూపిన వ్యవసాయాన్నే నమ్ముకుంది. వరి, వేరు శనగా, పత్తి, కందులతో పాటు వివిధ రకాల తోటలు సాగు చేయగా.. ఓ ఏడాది లాభం, మరో ఏడాది నష్టం వచ్చినా వెనుతిరగలేదు. పంటలు అమ్మగా వచ్చిన ఆదాయంతో భర్త వైద్యం కోసం చేసిన అప్పులు తీరుస్తూ, పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ కుమార్తె అనితను కానిస్టేబుల్‌ను చేసింది ఆ తల్లి.పెద్ద కుమారుడు మురళీధర్‌రెడ్డి హైదరాబాద్‌లో పీజీ చేస్తూ ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరగా, చిన్న కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాగార్జునసాగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదివుతున్నాడు.  

వ్యవసాయంతో జీవన పోరాటం
వెల్దండ: వెల్దండకు చెందిన గొడుగు యాదమ్మ వ్యవసాయాన్నే నమ్ముకుని ముందకు సాగుతోంది. ఆమె భర్త ఎనిమిదేళ్ల క్రితం, ఆ తర్వాత చిన్న కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ తర్వాత ఆవేదన చెందినా, కొద్దికాలానికి ధైర్యాన్ని కూడగట్టుకుని తమ నాలుగు ఎకరాల పొలంలో పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం టమాట, వంకాయ, చిక్కుడు తోటలు సాగు చేస్తోంది.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top