ఫీజులు పెంచొద్దు!

don't increase school fees - Sakshi

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలు

ప్రైవేట్‌ పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశాలు

పరిశీలనలో తిరుపతిరావు కమిటీ నివేదిక

వనపర్తి విద్యావిభాగం : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఏటా పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చని ఇచ్చిన తిరుపతిరావు కమిటీ నివేదిక పరిశీలనలోనే ఉందని తెలిపింది. ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు గతేడాది ఫీజులనే కొనసాగించాలని స్పష్టంగా ఆదేశించింది. 

నిబంధనలు తూచ్‌!
జిల్లాలో ఉన్న 110ప్రైవేట్‌ పాఠశాలల్లో 50వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే టెక్నో, టాలెంట్, ఒలంపియాడ్‌ తదితర పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్, బ్యాడ్జ్‌ల పేరుతో ఫీజుల భారం మోపుతున్నారు.    

తిరుపతిరావు కమిటీ నివేదికపై నిరసనలు
కార్పోరేట్, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని పేరెంట్స్‌ కమిటీల పోరాటాలతో ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశీలన అనంతరం ప్రైవేట్‌ పాఠశాలలు ప్రతి సంవత్సరం  10శాతం ఫీజులు పెంచుకోవచ్చని ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే ఫీజుల భారంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు తిరుపతిరావు కమిటీ నివేదికపై మండిపడుతున్నారు. తిరుపతిరావు కమిటీ నివేదికను అమలు చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరోసారి ఆదేశాలు  
ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని బుకాయిస్తున్నాయి. దీంతో తాజాగా ప్రభుత్వం మంగళవారం మరోసారి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫీజులు పెంచొద్దని గతేడాది వసూలుచేసిన పాత ఫీజుల ప్రకారం అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ అధిక0గా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top