నీకు వచ్చే జీతంతో ఏం చేస్తావు? | Eswar Reddy Love Failure Stories in Telugu - Sakshi World of Love
Sakshi News home page

నన్ను వదలి వెళ్లనంది.. కానీ, ఇప్పుడు..

Oct 4 2019 8:10 AM | Updated on Oct 30 2019 5:49 PM

Young Man Love Failure Story - Sakshi

నేను, ఒక అమ్మాయి 7 ఇయర్స్ నుంచి చాలా ప్రేమగా ఉంటున్నాం. తనకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా తనంటే చాలా ఇష్టం. నేను జీవితంలో స్థిరపడ్డాక ఇద్దరం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం​. ఎందుకంటే.. ‘నువ్వే వచ్చి మా వాళ్లను కూడా ఒప్పిస్తేనే పెళ్లి’ అన్నది. నేను సరే అన్నాను. ఆ తర్వాత నేను ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ, నాకు ఎక్కడా అవకాశం దొరకలేదు. ఈ లోపు అమ్మాయి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. తను ఆ సంబంధాలు తప్పిపోయేలా చేసిందో.. లేక వాళ్లకు నచ్చలేదో తేలేదు కానీ, నా కోసమే పెళ్లి సంబంధాలు చెడగొట్టానని నాతో చెప్పింది.

ఇలా ఒక 5 సంబంధాలు వెళ్లిపోయాయి. ఈలోపు నాకు కూడా ఒక చిన్న ఉద్యోగం దొరికింది. నేను ఆ ఉద్యోగంలో చేరిన ఒక 6 నెలలకి ఇంకొక సంబంధం వచ్చింది. ఆ విషయం నాతో చెప్పింది. ‘సరే నాకు జాబ్ వచ్చింది కదా! నేను వెళ్లి మీ పెద్దలను అడుగుతాను. నువ్వు పెళ్లి చూపులకు వెళ్లకు’ అని చెప్పాను. కానీ తను మాత్రం ‘నీకు వచ్చే జీతంతో ఏం చేస్తావు? అద్దెలకి కూడా చాలవు’ అంది. తర్వాత ‘ సరే నేను పెళ్లి చూపులకు వెళ్తాను. ఎలానో ఒకలా చివరిగా ఈ సంబంధం పోయేలా చేస్తాను’ అని చెప్పి వెళ్లిపోయింది. నేను ఎంతో సంతోషించాను. ఒక రోజు తరువాత ‘ నాకు పెళ్లి సెట్ అయింది. అన్ని డేట్స్ కన్‌ఫర్మ్‌ చేశారు.

నువ్వు ఇక నన్ను వదిలేయ్‌!’ అంది.  ‘ఇప్పుడు మీ రెండు కుటుంబాలే కదా మాట్లాడుకుంది. ఇంకా.. ఎంగేజ్‌మెంట్‌ అవ్వలేదు కదా! నేను నా ఇంట్లో వాళ్లను తీసుకొని మీ ఇంటికి వెళ్తాను నాకు కొంచెం సపోర్టుగా ఉండు’ అని అడిగాను. తాను మాత్రం ‘‘  నువ్వు చేతకాని వాడివి, నీ వల్ల కాదు వదిలేయ్‌! నేను నీకు సపోర్ట్‌గా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడను’’  అంది. చాలా బ్రతిమలాడుకున్నా తాను మారలేదు. తనంటే నాకు చాలా చాలా ఇష్టం. పెళ్లిచూపులకు ఒక రోజు ముందు తను నాతో ‘నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను’ అని చెప్పింది. కానీ ఇప్పుడు ఇలా మారిపోయి ‘నన్ను మర్చిపోతే బావుంటుంది’ అంటోంది. ఇప్పుడు నాకు ఏం అర్థం కావడం లేదు. నేను ఏం చేస్తే నాకు తను జీవిత భాగస్వామి అవుతుందో, నాకు ఏదైనా మంచి సలహా ఉంటే చెప్పగలరు.
- ఈశ్వర్‌ రెడ్డి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement