
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) మన తెలుగువారికి కాంతార సినిమా ద్వారా దగ్గరవడం మాత్రమే కాదు మన జూనియర్ ఎన్టీయార్‌కు సోదర సమానుడుగా మారడం ద్వారా కూడా మరింతగా మనకు చేరవయ్యాడు. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్‌లో భాగంగా మన దగ్గర కూడా మన జూనియర్ ఎన్టీయార్ సాక్షిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆ ఈవెంట్‌లో ఎన్టీయార్, రిషబ్ ల తర్వాత హైలెట్‌గా నిలిచింది రిషబ్ జీవిత భాగస్వామి ప్రగతి శెట్టి. హీరోయిన్ స్థాయి అందంతో మెరిసిపోయిన ఆమె అంతే అణకువతో కూడిన ప్రసంగం ద్వారా కూడా ఆకట్టుకుంది.

ప్రస్తుతం కాంతారా కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ప్రగతి శెట్టి(Pragathi Shetty) రిషబ్ శెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక సినిమా కార్యక్రమంలో క్యాజువల్‌గా కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌గా మారారు. రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది ఫేస్‌బుక్ అనే చెప్పాలి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సినిమాలను ఇష్టపడే సగటు ప్రేక్షకురాలిగా రిషబ్‌కు చేరువైన ప్రగతి ఆ తర్వాత అతనితో ప్రేమలో పడింది.
అయితే వీరిద్దరి ప్రేమకధ ప్రారంభమైనప్పుడు రిషబ్ సినిమాల్లో కెరీర్ పరంగా నిలదొక్కుకోలేదు. .దాంతో రిషబ్‌ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రగతి తల్లిదండ్రుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది అయితే, ప్రగతి పట్టు వీడకపోవడంతో... అతి కష్టం మీద వారు ఒప్పుకున్నారు. అలా ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు వారికిద్దరు అన్నట్టుగా ప్రస్తుతం ఒక బాబు, పాపలతో వీరిది చక్కని అందమైన సంసారం..

సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది తరచుగా తన కుటుంబ జీవితం నుంచి స్నిప్పెట్‌లను అభిమానులతో పంచుకుంటుంది. రిషబ్ 41 పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫొటోలు, గత ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త, పిల్లలకు ఉన్న అనుబంధం గురించి పెట్టిన పోస్ట్‌లు నెటిజన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి.
ఐటీ ఉద్యోగినిగా ఉన్న ప్రగతి రిషబ్‌తో పెళ్లి తర్వాత ఫ్యాషన్ పై తన టీనేజి అభిరుచికి సానబెట్టింది. అలా ఆమె సినిమారంగంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారేందుకు అదే బాటలు వేసింది. ఇప్పటికీ ఫ్యాషన్ తనకు హాబీ మాత్రమే అని చెబుతున్న ప్రగతి... కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొఫెషన్‌లో అనూహ్యంగా రాణిస్తోంది. ప్రేమ నుంచీ పెళ్లి దాకా ఆ తర్వాత కూడా కష్టసుఖాలు అన్నింటినీ సమానంగా పంచుకుంటూ పరస్పరం విజయాలకు కారణమవుతూ సాగుతున్నదీ జంట. సినీ రంగంలో ఉన్న చాలా మందికి స్ఫూర్తిని అందించే దాంపత్యం వీరిద్దరిదీ అనడం నిస్సందేహం.