
ముంబై: మహానగరం ముంబైలో 19 ఏళ్ల యువతీయువకుల ప్రేమ వ్యవహారం సంచలనంగా మారింది. పోవాయ్ ప్రాంతంలో తన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న 19 ఏళ్ల ప్రియురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే పోలీసుల జోక్యంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
ఘాట్కోపర్‌లోని పార్క్‌సైట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం పోవాయ్‌లోని మహాత్మా ఫులే మార్కెట్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఇందుకు అతని ప్రియురాలే కారణమని భావిస్తూ, ఆమె ఇంటికి వెళ్లి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఎటువంటి అఘాయిత్యం చేసుకోకూడదనే భావనతో ఆమె ఇంటికి వెళ్లారు.
అయితే ఆమె ఉంటున్న ఇంటికి తాళం వేసివుంది. దీంతో ఒక కానిస్టేబుల్ తలుపులు బద్దలు కొట్టి, లోనికి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆమె ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని విలవిలలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులు ఆమెకు కిందకు దించి, ఘాట్కోపర్‌లోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. యువకుని మృతిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.