
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎక్కువ సమయంలో సతీమణి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala)కే కేటాయిస్తున్నాడు. ఖాలీ సమయం దొరికితే భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్తున్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా తన ప్రేమ కథను చెబుతూ.. శోభితను పొగడ్తలతో ముంచేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితతో ఎలా ప్రేమలో పడ్డాడో వివరించాడు.
(చదవండి: ‘బుజ్జితల్లి’ పాట వల్ల శోభిత నాతో గొడవపడింది : నాగ చైతన్య)
ఓ టీవీ చానల్లో జగపతి బాబు నిర్వహిస్తున్న టాక్ షోకి వెళ్లిన నాగ చైతన్య.. తన ప్రేమ కథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సోషల్ మీడియా వల్లే వీరిద్దరికి పరిచయం ఏర్పడి..అది కాస్త ప్రేమ, పెళ్లి వరకు దారి తీసిందట. ‘ఓ సారి నేను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నా క్లౌడ్ కిచెన్ 'షోయు' గురించి పోస్ట్ పెట్టాను. దానికి శోభిత ఎమోజీతో కామెంట్ చేసింది. వెంటనే నేను రిప్లై ఇచ్చాను. అలా చాటింగ్ ద్వారా మేమిద్దరం క్లోజ్ అయ్యాం. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. నా జీవిత భాగస్వామిని ఇన్స్టాగ్రామ్ ద్వారా కలుస్తానని అస్సలు ఊహించుకోలేదు’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అదే షోలో ‘మీరు ఏది లేకుండా జీవించలేరు’ అని జగపతి బాబు అడగ్గా.. చైతన్య వెంటనే ‘నా భార్య శోభిత’ అని సమాధానమిచ్చాడు. తన జీవితంలో శోభితకు అధిక ప్రాధాన్యత ఉందని చైతూ చెప్పారు.
కాగా, నాగచైతన్య-శోభితల పెళ్లి గతేడాది డిసెంబర్లో జరిగింది. అంతకు ముందు 2017లో సమంతను ప్రేమ వివాహం చేసుకున్న చైతూ.. 2021లో విడాకులు ఇచ్చాడు. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండి.. 2024లో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు.కొద్దిమంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు.