
నాగ చైతన్య(Naga Chaitanya) కెరీర్‌లో అత్యధిక వసూళ్ల(రూ. 100 కోట్లు)ను సాధించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజైన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బుజ్జితల్లి పాట రిలీజ్‌కి ముందే సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మొన్నటి వరకు ఏ ఈవెంట్‌లో చూసినా ఈ పాట వినిపించేంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈ పాట గురించే ఎక్కువగా చర్చించారు. అంత సూపర్ హిట్‌గా నిలిచిన ఈ పాట.. నాగ చైతన్యకు మాత్రం కాస్త ఇబ్బందినే కలిగించిందట.
ఈ పాట కారణంగా తన సతీమణి శోభిత(sobhita dhulipala) కొన్నాళ్లపాటు మాట కూడా మాట్లాడలేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్యనే చెప్పారు. తాజాగా ఆయన జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘బుజ్జితల్లి’ పాట వెనుక జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకున్నాడు.
‘శోభితను నేను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తాను. అయితే ఈ పేరునే తండేల్‌లో చిత్రంలో సాయి పల్లవికి పెట్టడం.. బుజ్జితల్లిపై పాట కూడా రావడంతో శోభిత అప్సెట్ అయింది. కోపంతో కొన్నాళ్ల పాటు నాతో మాట్లాడలేదు. ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది. కానీ నేనెందుకు అలా చేస్తా? అని నవ్వుతూ చెప్పాడు చైతన్య. ఇక భార్యభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచంలో గొడవ పడని జంటలు ఉండవు. ఇద్దరి మధ్య గొడవే జరగలేదంటే..వారి రిలేషన్షిప్ నిజమైనది కాదని అర్థం’ అని చెప్పుకొచ్చాడు.
నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.