ప్రేమ కానుక

Lord Vishnu And Goddess Lakshmi Love - Sakshi

ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంకురించింది. ఇంకేం, లక్ష్మీనారాయణుల పెళ్లికి సిద్ధమైంది దేవలోకమంతా. తన ప్రేమకానుకగా ఆయన ఆమెకి తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు నివాసంగా.

సముద్రంలో నిక్షిప్తమైన ఉన్న అమృతాన్ని, అమృతోపమానమైన వస్తుసామగ్రినీ పొందడం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు దేవతలూ రాక్షసులూ. పాలసముద్రం దగ్గరికొచ్చారు అందరూ కలిసి. సముద్రంలో దాగున్న లక్ష్మీదేవి గమనిస్తోంది. తాము పాము తలవైపు పట్టుకుని చిలుకుతామన్నారు రాక్షసులు. సరేనన్నాడు శ్రీహరి. కొంతసేపయ్యాక తోకవైపు పట్టుకుంటామన్నారు– తలవైపు నుండి విషం వస్తుంటే ఆ ఘాటుకి తట్టుకోలేక. దానిక్కూడ సరేనన్నాడు నారాయణుడు. ఇంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం దిగబడిపోయింది. మేం వెళ్లిపోతాం అన్నారు రాక్షసులు. ‘కాదుకాదని’ రాక్షసుల్ని ఒప్పించి తాను తాబేలు రూపాన్నెత్తి పనిని కొనసాగింపజేశాడు విష్ణువు.

ఇలా ప్రతి సందర్భంలోనూ తన కార్యసాధన పద్ధతిని నిరూపించుకుంటూ ఓసారి గద్దించి మరోసారి బతిమాలి ఇంకొకసారి తాబేలు రూపాన్నెత్తి... ఇలా మొత్తానికి అమృతాన్ని సాధించి దాన్ని రాక్షసులకి కానీకుండా చేశాడు జనార్దనుడు. సముద్రపు కెరటాల మీదుగా ఉయ్యాలలూగుతూ వచ్చి శ్రీమన్నారాయణుని కార్యదీక్షాదక్షతకి ఆనందపడి చూపుల్ని కలిపింది క్షీరాబ్ధి తనయ శ్రీ మహాలక్ష్మి శ్రీహరితో. అంతేకాదు, పాదాభివందనం కూడా చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలని ధరించి కూడ ఆవంతైనా అహంకారం లేకుండా వినయంతో నమస్కరించింది. ఆనందపడ్డ విష్ణువు చూపుల్ని కలిపాడు లక్ష్మితో.

ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంకురించింది. ఇంకేం, లక్ష్మీనారాయణుల పెళ్లికి సిద్ధమైంది దేవలోకమంతా. తన ప్రేమకానుకగా ఆయన ఆమెకి తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు నివాసంగా. ఆమె శ్రీహరి హృదయం మీదనే నివసిస్తూ– ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో ముందే గమనించి తనవంతు సహకారాన్ని ఇయ్యడం ప్రారంభించింది. ‘రావణుణ్ణి ఎలా వధించాలా?’ అని ఆలోచిస్తుంటే వేదవతీ రూపంతో వెళ్లి రావణునికి మరణ శాపాన్నిచ్చి వచ్చింది. అంటే పెళ్లికి ముందూ పెళ్లికాలంలో పెళ్లయ్యాక కూడ ఉండేదే ప్రేమ అని పురాణ భావం కదా...
– డి.వి.ఆర్‌.

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top