
రాష్ట్ర ఓటర్ల జాబితాలోమహిళలే అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 61 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభా 7.93 కోట్లు ఉండగా, అందులో 5.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలోని అతి పెద్ద నియోజకవర్గంగా షోళింగనల్లూరు, చిన్న నియోజకవర్గంగా కీల్ వేలూరు జాబితాలోకి ఎక్కాయి.
సాక్షి, చెన్నై : రాష్ట్ర ఓటర్ల జాబితాలో మహిళలదే పైచేయిగా ఉంది. రాష్ట్రంలో ఏటా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. జనవరి నాటికి 18 ఏళ్లు దాటిన వారందరి పేర్లు తొలి విడతలో, తదుపరి ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ చివరి నాటికి మరో విడతగా కొత్త ఓటర్ల నమోదు సాగుతోంది. ఆ మేరకు ఈ ఏడాది జనవరి నాటికి నమోదైన వివరాలను అదే నెల ఓటర్స్ డే సందర్భంగా ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.92 కోట్లుగా ప్రకటించారు. పురుషులు 2.93 కోట్లు, స్త్రీలు 2.99 కోట్లు, ఇతరులు 5,040గా వివరించారు. తాజాగా అక్టోబర్ మూడో తేదీ నాటికి సిద్ధం చేసిన మరో జాబితాను మంగళవారం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. ఆయా జిల్లాల్లోని ఓటర్ల వివరాలతో కూడిన జాబితాలను కలెక్టర్లు విడుదల చేశారు. జనవరి నమోదుతో తరహాలో మళ్లీ మహిళల హవా సాగడంతో పాటుగా సంఖ్య మూడు కోట్లు దాటడం విశేషం. పురుష ఓటర్ల కన్నా, స్త్రీల ఓటర్లు రాష్ట్రంలో మరోమారు ఆధిక్యతను చాటుకున్నారు. ఈసారి ఏకంగా 61 లక్షల మూడు వేల 776 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడం గమనార్హం.
కొత్త జాబితా విడుదల
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల నమోదు, కొత్త జాబితా తయారీ పర్వం గత కొద్ది రోజులుగా సాగుతూ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని నేతృత్వంలోని అన్ని పనులు ముగియడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తమ తమ పరిధిలోని జాబితాలను ఉదయాన్నే ప్రకటించారు. నియోజకర్గాల వారీగా ఆయా జిల్లాల్లో జాబితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్త ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని విడుదల చేశారు. అందులోని వివరాల మేరకు రాష్ట్రంలో ఏడు కోట్ల 93 లక్షల 78 వేల 485 మంది జనాభా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ జనాభాలో ఐదు కోట్ల 95 లక్షల 88 వేల 002 మంది ఓటర్లు ఉన్నట్టు వివరించారు. వీరిలో పురుషులు 2,94,84,492, స్త్రీలు 3,00,98,268 మంది ఉన్నట్టు ప్రకటించారు. ఇతరులు 5,242 మంది ఉన్నారు. ఇక, రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గంగా షోళింగనల్లూరు జాబితాలోకి ఎక్కింది.
ఇక్కడ∙ 6,24,405 మంది ఓటర్లు ఉన్నారు. లక్షా 68 వేల 275 మంది ఓటర్లతో కీల్ వేలూరు అతి చిన్న నియోజకవర్గ జాబితాలోకి ఎక్కింది. 18 నుంచి 19 సంవత్సరాల్లోపు ఓటర్లు 5,50,556, 20 నుంచి 29 సంవత్సరాల్లోపు ఓటర్లు 1,22,05,888 ఉన్నారు. 80 సంవత్సరాలకు పైబడ్డ వారు 10,60,361 మంది ఓటర్లుగా ఉన్నారు. రాజధాని నగరం చెన్నైలోని 16 నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాను కార్పొరేషన్ కమిషనర్ కార్తికేయన్ విడుదల చేశారు. ఇందులో 40 లక్షల 73 వేల 703 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20 లక్షల 13 వేల 168, స్త్రీలు 20 లక్షల 59 వేల 557, ఇతరులు 978 మంది ఉన్నారు.