జాతర పనులపై శీతకన్ను | Telangana Govt not serious about Medaram Jatara | Sakshi
Sakshi News home page

జాతర పనులపై శీతకన్ను

Jan 20 2018 11:02 AM | Updated on Jan 20 2018 11:03 AM

Telangana Govt not serious about Medaram Jatara - Sakshi

మేడారం జాతర పనులు నత్తనడకన సాగుతు న్నాయి. జాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చెబు తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పనులకు పొంతన ఉండడం లేదు. ఈనెల 15వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించిన అధికారులు.. ఆ లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలపడ్డారు. మహాజాతర తేదీలు దగ్గర పడుతున్నా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, సంబంధిత శాఖామంత్రి ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులకు కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.  జాతర నిర్వహణ పనులను పర్యవేక్షించిన కలెక్టర్‌ మురళి ఆకస్మిక బదిలీతో నిర్వహణ భారం ఇన్‌చార్జీ కలెక్టర్‌ కర్ణన్‌పైనే పడింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వాకాటి కరుణకు స్పెషలాఫీసర్‌గా బాధ్యతల అప్పగింతపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడం విమర్శలకు తావిస్తోంది.  – సాక్షి ప్రతినిధి, వరంగల్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మేడారం జాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న  మాటలకు, క్షేత్రస్థాయిలో పనులకు పొంతన ఉండడం లేదు. జనవరి 15వ తేదీలో గా జాతర పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించినా... ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మహాజాతర తేదీలు దగ్గర పడుతున్నా మంత్రులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు.  2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరగనుంది. ఈ జాతరలో రూ.80.50 కోట్లతో ప్రభుత్వం వివిధ పనులు చేపట్టింది. ఇందులో కీలకమైన మంచినీటి సరఫరా పనులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇంత వరకు పూర్తి కాలేదు. సుమారు ఐదు వేల టాయిలెట్లు ఇంకా బేస్‌మెంట్‌ దశలోనే ఉన్నాయి.  జనవరి ప్రారంభం నుంచే భక్తులు వేలాదిగా మేడారం వచ్చిపోతున్నారు. ఆది, బుధవారాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతోంది. కనీసం చాటు కరువై మహిళా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన డార్మిటరీ, టాయిలెట్లు నిరుపయోగంగా ఉన్నాయి. జాతరకు నెల రోజుల ముందు కలెక్టర్‌ మురళీ బదిలీపై వెళ్లగా  మంచిర్యాల కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రస్తుతం ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందు కలెక్టర్‌ కర్ణన్‌ ఇక్కడే ఉంటూ పనులు పర్యవేక్షించడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.   

కన్నెత్తి చూడని మంత్రులు
ఇన్‌చార్జీ కలెక్టర్‌ కర్ణన్, ఎస్పీ భాస్కరన్‌ ఎక్కువ సమయం ఇక్కడే ఉంటూ జాతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కానీ మేడారం జాతర పనుల పర్యవేక్షణ విషయంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చందూలాల్, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పూర్తిగా సచివాలయంలో సమీక్షలకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు  మేడారానికి రావడం లేదు. కోటి మంది భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు స్వయంగా  పరిశీలిస్తే పనుల్లో నాణ్యతతోపాటు వేగం పుంజుకుంటుందని భక్తులు ఆశిస్తున్నారు. జాతర పేరు మీద ప్రకటించిన అనేక పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. తాజాగా కొండాయి–ఊరట్టం రోడ్డు విస్తరణ, అభివృద్ధి కేవలం గ్రావెల్‌ వరకే పరిమితమైంది. దీంతోపాటు ఏటూరునాగారం  మండలంలో ఎలిశెట్టిపల్లి, కొండాయిల వద్ద  వద్ద జంపన్నవాగుపై ఒక్కొక్కటి రూ.50 లక్షలతో నిర్మించనున్న రోడ్‌డ్యాం నిర్మాణ పనులకు టెండర్లు ముగిసినా పనులు పూర్తి చేయలేకపోయారు. గత జాతరలో ప్రకటించిన చెక్‌డ్యాం  నిర్మాణ పనులు అటకెక్కాయి.

ఉత్తర్వుల జారీ ఎప్పుడు
2018 జాతరకు సంబంధించి కొత్త జిల్లా, గత జాతరలో పని చేసిన అధికారులు లేని లోటు కొట్టొచ్టినట్టు కనిపిస్తోంది. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వాకాటి కరుణను నియమిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ జనవరి 13న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు. వారం రోజులు గడిచినా నేటికీ ఉత్తర్వులు జారీ కాలేదు. మరోవైపు జాతర తేదీలు దగ్గర పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement