మేమున్నాం.. ఆందోళన వద్దు

World leaders condemn Easter Sunday bombings in Sri Lanka - Sakshi

పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంకకు భారత్‌ భరోసా

సిరిసేన, విక్రమసింఘేలతో మాట్లాడిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లపై భారత్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీలంక రాష్ట్రపతి మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్‌ విక్రమసింఘేలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ‘అత్యంత క్రూరమైన, అనాగరిక చర్య’గా అభివర్ణించారు. ఈ షాక్‌నుంచి కోలుకోవడంతోపాటు, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు శ్రీలంకకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. విశ్వ మానవాళికి ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందనడానికి శ్రీలంకలో వరుసపేలుళ్లు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ‘సీమాంతర ఉగ్రవాదంతోపాటు, ఇలాంటి ఉన్మాదపు దాడులకు పాల్పడుతున్న వారిని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజమంతా ఏకమవ్వాలి.

దీన్ని సమర్థించుకునే ఏ చర్యనూ సహించకూడదు’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదివారం శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస ఆత్మాహుతిదాడుల్లో 200 మందికి పైగా చనిపోగా.. 500 మందికి పైగా గాయలయ్యాయి. ‘మృతుల కుటుంబాలకు, శ్రీలంక ప్రభుత్వానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి దారుణమైన దాడులకు పాల్పడిన వారెంతవారైనా కఠినంగా శిక్షించాల్సిందే’అని విదేశాంగశాఖ ప్రకటన పేర్కొంది.  ‘కొలంబోలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.  

ఖండించిన దేశాధినేతలు
లండన్‌/కొలంబో/ముంబై: శ్రీలంకలో ఉగ్రదాడులను ప్రపంచ వ్యాప్తంగా నేతలు ఖండించారు. అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌ తదితర దేశాధినేతలతోపాటు పలువురు హాలీవుడ్, బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీఎం కేసీఆర్‌ దిగ్బ్రాంతి
సాక్షి, హైదరాబాద్‌: శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైందిగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

కేటీఆర్‌ దిగ్భ్రాంతి
శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రదినం రోజున అనాగరిక, క్రూరచర్యతో విలువైన ప్రాణాలను తీశారని అన్నారు. బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదివారం ట్విటర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మానవత్వానికే  మచ్చ
సాక్షి, అమరావతి: శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీలంక మారణ హోమం మానవత్వానికే మాయనిమచ్చని, ప్రాణం పోసే శక్తి లేనివారికి ప్రాణం తీసే హక్కులేదని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

కిరాతక చర్య: జగన్‌
సాక్షి, అమరావతి: శ్రీలంకలోని కొలంబోలో జరిగిన మారణహోమాన్ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ కిరాతక చర్యలకు బలైన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి విచక్షణారహితమైన హింసకు తావే లేదని జగన్‌ అభిప్రాయపడ్డారు.  అమాయకులను బలిగొన్న ఈ దుశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండింస్తూ ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top