భారత్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు! | Sakshi
Sakshi News home page

భారత్‌ కృషి ప్రశంసనీయం: డబ్ల్యూహెచ్‌ఓ

Published Tue, Mar 17 2020 6:44 PM

WHO Says India Commitment To Combat Covid 19 Is Impressive - Sakshi

జెనీవా: ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ఈ అంటువ్యాధి ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని కొనియాడింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) సభ్యులతో మంగళవారం సమావేశమైన అనంతరం.. డబ్ల్యూహెచ్‌ఓలో భారత ప్రతినిధి హెంక్‌ బెకెడం మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ముందుకు సాగుతోంది. ప్రధాన మంత్రి కూడా గొప్పగా కృషి చేస్తున్నారు. ఐసీఎమ్‌ఆర్‌, భారత ఆరోగ్య శాఖ గొప్ప పరిశోధనా సామర్థ్యం కలిగి ఉన్నాయి. వైరస్‌ను అరికట్టేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇవి కూడా భాగస్వామ్యమవుతున్నాయి. అదే విధంగా భారత్‌లోని ప్రతీ వ్యవస్థ బాగా పనిచేస్తోంది’’అని కితాబిచ్చారు. (కరోనాను ఎదుర్కో​వాలంటే అదొక్కటే మార్గం!)

కాగా కరోనాను ఎదుర్కొనేందుకు మందులు, వ్యాక్సిన్ల తయారీకై పరిశోధనలు ప్రారంభించామని ఐసీఎమ్‌ఆర్‌ గతవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా దాటికి భారత్‌లో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మంగళవారం నాటికి 126 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7000 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. ఇదిలా ఉండగా... కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాటి నుంచి అక్కడ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి.(‘కరోనా’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం!

చదవండి: కరోనా ఎఫెక్ట్‌‌: షాకిచ్చిన రైల్వేశాఖ

Advertisement
Advertisement