ఆ విషయంలో అమెరికా తర్వాత స్థానం ఇండియాదే

White House Said usa First In Covid 19 Tests India Second - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలో తమ దేశంలో చేసినన్ని కరోనా టెస్టులు మరెక్కడా జరగలేదని అంటున్నారు వైట్‌ హౌస్‌ అధికారులు. కరోనా టెస్టుల విషయంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్‌​ తమ తర్వాత స్థానంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో అమెరికాలో 42మిలియన్ల టెస్టులు చేసి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. 12 మిలియన్ల టెస్టులతో భారత్‌ రెండవ స్థానంలో ఉంది’ అన్నారు. టెస్టుల విషయంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే.. ఇది ఎంతో మెరుగ్గా ఉందని కైలీ తెలిపారు. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3.5 మిలియన్లుగా ఉండగా 1,38,000 మరణాలు సంభవించాయి. (నేటి నుంచి యూఎస్‌కు విమానాలు)

ఇక వ్యాక్సిన్‌ అభివృద్ధి గురించి కైలీ మాట్లాడుతూ.. మోడరనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మంచి సంకేతాలను చూపిస్తున్నారన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 45 మందిలో సానుకూల, తటస్థ రోగనిరోధక ప్రతిస్పందనను చూపిస్తున్నారని తెలిపారు. కోలుకున్న రోగులతో దీన్ని పోల్చి చూస్తే ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. ‘ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే.. కరోనా వ్యాక్సిన్‌ ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నామో.. చివరకు అదే లభిస్తుంది అన్నారు. ముఖ్యంగా మోడరనా వ్యాక్సిన్ జూలై చివరి నాటికి మూడవ దశకు చేరుకుంటుంది’ అని కైలీ తెలిపారు. దీనిలో 30,000 మంది పాల్గొంటారన్నారు. (కరోనాతో గేమ్స్‌ )

మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కోసం 450 మిలియన్ డాలర్లతో రెజెనెరాన్‌ కుదరుర్చుకున్న ఒప్పందం చాలా ప్రోత్సాహకరమైనదని అన్నారు కైలీ. ప్రస్తుతం కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న అనేక చికిత్సా విధానాలలో ఇది ఒకటి. దీన్ని రోగనిరోధకత, చికిత్స కోసం ఉపయోగించవచ్చు. వేసవి చివరి నాటికి 70 నుంచి 300 వేల డోసులను సిద్ధం చేస్తామని రెజెనెరాన్‌ తెలిపిందన్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top