పౌరసత్వం పొందిన విదేశీయులపై అమెరికా కన్ను

USCIS To Setup Task Force To Check Citizenship From 1990 - Sakshi

వాషింగ్టన్‌ డీసీ, అమెరికా : హెచ్‌–1తో పాటు అన్ని రకాల వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తన దృష్టిని పౌరసత్వం పొంది స్థిరపడిన విదేశీయులపై పడింది. గత 30 ఏళ్లుగా దేశ పౌరసత్వం పొందిన వారి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సంకల్పించింది. తప్పుడు ధ్రువపత్రాలతో పాటు అక్రమ మార్గాల్లో పౌరసత్వం పౌందారని అనుమానిస్తున్న అమెరికా లక్షలాది దరఖాస్తులను మరోసారి పరిశీలించడానికి పావులు కదుపుతోంది. ఈ మేరకు యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌)  లాస్‌ ఏంజిల్స్‌లో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. తప్పుడు సమాచారంతో దేశ పౌరసత్వాన్ని పొందిన వారే లక్ష్యంగా యూఎస్‌సీఐఎస్ తరఫున కొత్త టాస్క్‌ ఫోర్స్‌ పని చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది. టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుపై యూఎఎస్ సీఐఎస్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ సిస్నా మాట్లాడుతూ, తాజా ప్రక్రియను పూర్తి చేయడానికి డజన్ల సంఖ్యలో లాయర్లను, ఇమిగ్రేషన్‌ అధికారులను నియమించనున్నట్టు చెప్పారు.

ఈ టాస్క్ ఫోర్స్ అతి త్వరలో  రంగంలోకి దిగి పౌరసత్వం కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో దాదాపు రెండు కోట్ల మందికి పౌరసత్వం జారీ చేసినట్టు చెబుతున్నారు. అందులో 1990 నుంచి ఇప్పటివరకూ అంటే దాదాపు కోటి డెబ్బై లక్షల మంది పౌరసత్వాలను, వారి రికార్డులను ఈ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీ చేయాలని నిర్దేశించారు. పౌరసత్వం కోసం సదరు వ్యక్తులు ఇచ్చిన పత్రాలు, ఇంటర్వ్యూల్లో ఏవైనా తప్పుడు సమాచారం ఇచ్చారా? వంటి పలు కోణాల్లో దర్యాప్తు సాగనుంది. అనుమానాస్పద కేసులను న్యాయశాఖ పరిశీలనకు పంపాలని ఇమిగ్రేషన్ విభాగం భావిస్తోంది. సిస్నా అంచనా మేరకు వేల సంఖ్యలో అనుమానిత కేసులు న్యాయశాఖ వద్దకు చేరొచ్చు.

1990 నాటి నుంచి పౌరసత్వం పొందిన వారి రికార్డులను పరిశీలన చేయడం ఆశామాషీ వ్యవహారం కాదు. అయితే, అప్పట్లో తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలా వరకూ పేపర్‌, ఫింగర్‌ ప్రింట్‌ వర్క్‌లతో పౌరసత్వాలను ప్రధానం చేశారు. వీటన్నింటిని డిజిటలైజ్‌ చేస్తే తప్ప అన్ని దరఖాస్తులను పరిశీలించేందుకు అవకాశం కలుగదు. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా 2008లో అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌కు చెందిన ఓ అధికారి అక్రమంగా పౌరసత్వం పొందిన 206 మందిని గుర్తించారు. అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తరచుగా ఫింగర్‌ ప్రింట్‌లను అప్‌డేట్‌ చేయకపోవడం వల్లే అనర్హులైనప్పటికీ వారికి  పౌరసత్వం వచ్చినట్లు ఆతర్వాత విచారణలో తేలింది.

అనర్హులైన వారికి దేశ పౌరసత్వం దక్కిందని హోం ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ 2016 సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఒక రిపోర్టు అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు 858 మంది అనర్హులకు పౌరసత్వాన్ని లభించిందని ఆ రిపోర్టు సారాంశం. డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్‌ల లోపం వల్లే ఇలా జరిగిందని అందులో పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఇలా ఫింగర్‌ ప్రింట్స్‌ ఆచూకీలేకుండా పోయాయని తెలిపారు. సదరు రిపోర్టును పరిశీలించిన డీహెచ్‌ఎస్‌ 95 అనుమానిత కేసులను న్యాయశాఖ పరిశీలనకు పంపింది.

2017 జనవరిలో డీహెచ్‌ఎస్‌ రిపోర్టుపై యూఎస్ ఇమిగ్రేషన్ జాయింట్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఫలితంగా వందల సంఖ్యలో కేసులు న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విచారణలో భాగంగా జనవరిలో ఓ వ్యక్తికి అమెరికా పౌరసత్వాన్ని ఉపసంహరించింది.

దరఖాస్తుదారుడి జేబు ఖాళీ..
అక్రమ పౌరసత్వాలను అడ్డుకునేందుకు ఇమిగ్రేషన్ విభాగం ప్రారంభిస్తున్న ఈ కొత్త కార్యాచరణకు అయ్యే ఖర్చు మొత్తం పౌరసత్వ దరఖాస్తు దారులపైనే పడనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కోరకుండా దరఖాస్తు పత్రం ధరను పెంచి ఈ సొమ్ము రాబట్టాలని యూఎఎస్ సీఐఎస్‌ భావిస్తోంది. అంతేకాకుండా పౌరసత్వం పొందగోరే వారు ఇంటర్వ్యూలు పూర్తి కావాలంటే దరఖాస్తు చేసిన నాటి నుంచి కనీసం ఏడాది కాలం పడుతోంది.

అధిక శ్రమతో కూడుకున్న పని..
ఓ వ్యక్తి పౌరసత్వానికి అర్హుడా? అనర్హుడా? అన్న విషయాన్ని తేల్చేందుకు యూఎస్ సీఐఎస్‌తో పాటు న్యాయశాఖకు భారీ స్థాయిలో వనరులు ఖర్చవుతున్నాయి. అంతచేసినా అధిక కేసుల్లో పౌరసత్వానికి సదరు వ్యక్తి అర్హుడని తేలుతోంది. దీంతో  ఇమిగ్రేషన్ విభాగం అనవసర పని భారం పెంచుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అమెరికా వీసా ఆంక్షలపై మరిన్ని వార్తలకు కింద క్లిక్‌ చూడండి

చదువుకు సై.. కొలువుకు నై

హెచ్‌1బీ వీసా వాళ్లిష్టం

గడువు ముగిస్తే బహిష్కరణ!

హెచ్‌-1బీ : దడ పుట్టిస్తున్న కొత్త రూల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top