హెచ్‌-1బీ : దడ పుట్టిస్తున్న కొత్త రూల్‌

New Rule Allows Deportation If H-1B Extension Is Rejected - Sakshi

ముంబై : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైన కష్టాలు... హెచ్‌-1బీ వీసాదారులను ఇంకా వీడటం లేదు. కొత్త కొత్త నిబంధనలతో హెచ్‌-1బీ వీసాదారులకు ట్రంప్‌ షాకిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా మరో కొత్త రూల్‌ తీసుకొచ్చి హెచ్‌-1బీ వీసాదారులకు దడ పుట్టిస్తుంది. వీసా గడువు పొడగింపు లేదా స్టేటస్‌ మార్చుకోవడం తిరస్కరణకు గురైతే, హెచ్‌-1బీ వీసాదారులు దేశ బహిష్కరణ విచారణలను ఎదుర్కొనే ఈ కొత్త రూల్‌ వీసా దారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అమెరికా అథారిటీలు ఇచ్చే గడువు ముగిసినా కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడైంది. 

జూన్‌ 28న అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తీసుకొచ్చిన పాలసీ మెమొరాండమే హెచ్‌-1బీ వీసాదారుల్లో ఈ గుబులు రేపింది. ఈ మెమొరాండం ప్రకారం యునిటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌(యూఎస్‌సీఐఎస్‌) ‘నోటీస్‌ టూ అప్పియర్(ఎన్‌టీఏ)‌’  ను జారీ చేయడానికి వీలవుతుంది. దీంతో అమెరికాలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారులను తేలికగా దేశ బహిష్కరణ చేయడానికి వీలవుతుంది. ఇదే ఇప్పుడు ఎన్నారైల్లో సంచలనం కల్గిస్తోంది. వీసా పొడిగింపు దరఖాస్తు లేదా పిటిషన్‌ తిరస్కరణకు గురైనప్పుడు లేదా చట్టవిరుద్ధంగా ఆ దరఖాస్తుదారుడు అమెరికాలో ఉన్నప్పుడు ఈ నోటీసులు అందుకుంటాడు. ఈ నోటీసులే దేశ బహిష్కరణకు తొలి అడుగులు. అన్ని కేసుల్లో ఎన్‌టీఏలను జారీ చేయొచ్చు.

వీసా పొడిగింపు తిరస్కరణకు గురైనప్పుడు లేదా వీసా రాకున్నా 240 రోజులు గడువు దాటాక కూడా అమెరికాలో ఉంటే ఇమ్మిగ్రేష‌న్ అధికారుల నుంచి వ‌చ్చే ఈ నోటీసు ప్రకారం కోర్టులో హాజ‌రై స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. వీసా ప్రక్రియ పూర్తవడానికి సాధారణంగా 180 రోజులు పడుతుంది. ఒకవేళ ఆలస్యంగా దరఖాస్తు చేస్తే.. అది తేలే లోగే వీసా గడువు 240 రోజుల పూర్తవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువు పూర్తయ్యేలోగానే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఒకవేళ గడువు పూర్తయినా ద‌ర‌ఖాస్తు వ్యవహారం తేలే వ‌ర‌కు  అమెరికాలో ఉంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీసా పొడిగింపు దరఖాస్తును అంగీకరిస్తే సరే. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. 

వీసా రాకుంటే 240 రోజుల గ‌డువు దాటాక దరఖాస్తు విషయం తేలేవరకు మీరు అమెరికాలో ఉండాల్సి వస్తే, అది అక్రమంగా అమెరికాలో ఉన్న కిందకే వస్తుంది. దీంతో మీరు కోర్టులో హాజ‌రు కావాల్సి ఉంటుంది. నోటీస్‌ వచ్చిందంటే హెచ్‌-1బీ వీసాదారులు సమస్యల ఊబిలో చిక్కుకున్నట్టే. ఒక‌వేళ నోటీసుకు సమాధానం ఇవ్వకండా భార‌త్‌కు వ‌చ్చేస్తే మ‌ళ్ళీ అమెరికాలో అడుగు పెట్టకుండా అయిదేళ్ళు నిషేధం విధిస్తారు. నోటీసు వ‌చ్చేలోగానే త‌మ‌కు తాము దేశం విడిచి పెట్టి వెళ్ళేందుకు కోర్టు అనుమ‌తి కోర‌వ‌చ్చు. వీసా తిర‌స్కరించిన త‌ర‌వాత అక్కడే ఉంటే.. ఆ వ్యవ‌ధి ఏడాది దాటితే.. వారిపై ప‌దేళ్ళ వ‌ర‌కు మ‌ళ్ళీ అమెరికాలో ప్రవేశించ‌కుండా నిషేధం విధించే అవ‌కాశ‌ముందని తెలిసింది. ఈ నిబంధనలు చూసిన  హెచ్ 1 బీ వీసాదారులకు చుక్కలు క‌నిపిస్తున్నాయి. ప్రతిపాదిత కొత్త నిబంధ‌న‌లు విద్యార్థుల‌కు కూడా వ‌ర్తిస్తాయ‌ని తెలియ‌డంతో, అమెరికాలో ఉంటున్న విద్యార్థుల్లో కంగారు మొద‌లైంది. 

హెచ్‌1బీ వీసాలు 240 రోజుల‌కు ఇస్తుంటారు. వీసా ముగుస్తున్న స‌మ‌యంలో ఉద్యోగి త‌ర‌ఫున కంపెనీ ద‌ర‌ఖాస్తు చేసేది. గ‌డువును అమెరికా అధికారులు తిర‌స్కరిస్తే వెంట‌నే స‌ద‌రు ఉద్యోగి తిరిగి స్వదేశానికి వ‌చ్చేస్తారు. కంపెనీ మ‌ళ్ళీ ద‌ర‌ఖాస్తు చేసి వీసా వ‌స్తే  తిరిగి అమెరికా వెళ్ళేవారు. కాని ఇప్పుడు ఈ నిబంధనలను మరింత కఠనం చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top