కరోనా: వాళ్లతో మాట్లాడినా వైరస్‌ వ్యాప్తి!

US Scientists Warns Corona Virus May Spread Through Air Normal Breathing - Sakshi

అమెరికా శాస్త్రవేత్త హెచ్చరికలు 

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయలేక ఇప్పటికే పలు దేశాలు చేతులెత్తేయగా... మరికొన్ని దేశాలు మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ విభాగం అధిపతి ఆంటోనీ ఫౌజీ తాజాగా ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి తుమ్మడం లేదా దగ్గడం నుంచి మాత్రమే కాకుండా మాట్లాడినపుడు రోగి నోటి నుంచి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు.

అదే విధంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసల సమయంలోనే ఇది తన ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కరోనా జన్యుక్రమం, అది వ్యాపిస్తున్న తీరుపై పరిశోధనలు జరుపుతున్న జాతీయ సైన్స్‌ అకాడమీ ఏప్రిల్‌ 1న శ్వేతసౌధ వర్గాలకు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయనట్లయితే తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టాన్ని చూడాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?)

కాగా న్యూ ఇంగ్గండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసన్‌ పరిశోధనల ప్రకారం కరోనా గాలిలో కేవలం మూడు గంటల పాటే సజీవంగా ఉంటుందన్న విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిశోధనల ప్రకారం కరోనా పాజిటివ్‌ వ్యక్తి మాట్లాడినపుడు కూడా వైరస్‌ వ్యాప్తి చెందినట్లయితే.. దానిని కట్టడి చేయడం మరింత కష్టతరంగా మారనుంది. గాలిలో వేగంగా వ్యాపిస్తే మహమ్మారి కారణంగా ఊహించని స్థాయిలో మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.(24 గంటల్లో 1500 మంది మృతి)

ఇక హాంగ్‌కాంగ్‌ పరిశోధకులు కరోనా రోగులు, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడే పేషెంట్ల నమూనాలు సేకరించి వారిపై వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై ప్రయోగాలు చేపట్టారు. ఈ క్రమంలో మాస్కులు ధరించడం ద్వారా వైరస్‌ గాల్లోకి ప్రవేశించకుండా కొంతమేరకైనా అడ్డుకట్టవేయొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే చైనీస్‌ పరిశోధకుల పత్రికా సమర్పణలోని అంశాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మాస్కుల ద్వారానే కరోనా వార్డుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వైద్య సిబ్బంది ధరించే మాస్కులు, సూట్లను రోగులు వాడే బాత్‌రూంలు, రూంలలో వదిలేయడం, అనంతరం వాటిని శుభ్రం చేసి వాడే ప్రక్రియలో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడుతున్నారని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top