అవసరమైతే చైనాతో తెగదెంపులు: ట్రంప్‌

US President Donald Trump threatens to cut off relations with China - Sakshi

వాషింగ్టన్‌/లండన్‌/ఢాకా: కోవిడ్‌–19 సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య సంబంధాలు బీటలు వారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అవసరమైతే చైనాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిందని ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన ట్రంప్‌ కోవిడ్‌–19 కట్టడి చర్యల్లో చైనా వైఫ్యలంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫాక్స్‌ బిజినెస్‌ నెట్‌వర్క్‌ బ్రాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై పునః చర్చలకు ఇక ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడాలన్న ఆసక్తి కూడా తనకి లేదన్నారు.  చైనాతో సంబంధాల అంశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని, అసలు పూర్తిగా సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అదే జరిగితే అమెరికాకు 50 వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయన్నారు.   

కోవిడ్‌పై సహకరించుకోవాలి: చైనా  
చైనాతో తెగదెంపులౖకైనా సిద్ధపడతానని ట్రంప్‌ చేసిన హెచ్చరికలపై ఆ దేశం ఆచితూచి స్పందించింది. కోవిడ్‌–19ను ఎదుర్కోవడంలో ఇరుదేశాల ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేసి, కలిసి పనిచేయాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.  

భారత్‌లో 5.80 లక్షల సర్జరీలు రద్దు?
కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో భారత్‌లో 5 లక్షల 80 వేలకు పైగా సర్జరీలు రద్దు కావచ్చని, లేదంటే వాయిదా పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ భారత్‌లో శస్త్రచికిత్సలపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.

బంగ్లాదేశ్‌ రోహింగ్యా శిబిరాల్లో కరోనా
బంగ్లాదేశ్‌ దక్షిణ ప్రాంతంలో ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరంలో తొలి కరోనా కేసు నమోదైంది. బంగ్లాలో రోహింగ్యాల శిబిరాలు అత్యంత రద్దీతో ఉంటాయి. కాక్స్‌ బజార్‌ జిల్లాలోని ఒక శిబిరంలో తలదాచుకుంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడం ఆందోళన రేపుతోంది. బంగ్లాలో వివిధ శరణార్థి శిబిరాల్లో 10 లక్షల మంది తలదాచుకుంటున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top