తలచినదే.. జరుగునులే..! 

US Defense Department Pentagon Wants To Bring Mind Controlled Tech Troops - Sakshi

ఆలోచనలను ఆచరణలోకి తెచ్చే సరికొత్త ప్రాజెక్టు

ప్రారంభించిన అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌

మెదడుని కంప్యూటర్‌కు అనుసంధానించడమే లక్ష్యం

ముందుగా సైనికుల సాయంతో డ్రోన్లు నడిపేందుకు ప్రయత్నాలు  

రవి గాంచని చోటనూ కవి గాంచును.. అంటే మనిషి ఆలోచన సూపర్‌ఫాస్ట్‌ అన్నమాట. కానీ ఈ ఆలోచనలు ఆచరణలోకి రావాలంటే కొంత టైమ్‌ పడుతుంది. లైట్‌ వేయాలంటే స్విచ్‌ దగ్గరకు వెళ్లాలి.. లేదంటే రిమోట్‌నైనా వాడాలి. ఇవేవీ లేకుండా మీరు మనసులో ఓ మాట అనుకోవడమే తడవు పనులు జరిగిపోతే ఎలా ఉంటుంది. అబ్బో ఊహించలేనన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి! ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ విభాగం డార్పా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘నెక్స్‌ జనరేషన్‌ నాన్‌ సర్జికల్‌ న్యూరో టెక్నాలజీ ప్రోగ్రాం’పేరుతో కేవలం ఆలోచనలతోనే డ్రోన్లు నడిపించేందుకు గాను ఏడాది క్రితమే ఈ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 

కంప్యూటర్‌కు మెదడు అనుసంధానం.. 
డ్రోన్లు లేదా డ్రోన్ల గుంపులను కూడా ఆలోచనలతోనే నియంత్రించడం.. తద్వారా యంత్రాలతో పనిచేసే అవసరాన్ని తప్పించాలన్నది ఈ కొత్త ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా మన మెదడును కంప్యూటర్‌కు అనుసంధానించే (బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్, క్లుప్తంగా బీసీఐ) ఓ పరికరాన్ని తయారు చేస్తారు. ఈ పరికరాన్ని తగిలించుకున్న సైనికులు ఎక్కడో దూరంగా ఎగురుతున్న డ్రోన్లు ఏ దిశగా వెళ్లాలి? ఎంత వేగంగా వెశ్లాలి? బాంబులు ఎప్పుడు వదలాలి? వంటి అంశాలను తమ ఆలోచనలతోనే నియంత్రిస్తుంటారు.  

తరంగాలను ఒడిసిపట్టడమే లక్ష్యం.. 
డార్పాకు చెందిన నాడీ శాస్త్రవేత్త అల్‌ ఎమోండీ నేతృత్వంలో ఏడాది క్రితం ఈ సరికొత్త ప్రాజెక్టు మొదలైంది. అయితే ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని 6 యూనివర్సిటీలు/పరిశోధన సంస్థలు కూడా వేర్వేరుగా బీసీఐ తయారీ కోసం పరిశోధనలు ప్రారంభించాయి. పెంటగాన్‌ ఈ ప్రాజెక్టు కోసం సుమారు 600 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కార్నెగీ మెల్లన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విద్యుత్, అ్రల్టాసౌండ్‌ సంకేతాలతో బీసీఐని తయారు చేసేందుకు ప్రయతి్నస్తుండగా, పరారుణ కిరణాల సాయంతో జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ పరిశోధనలు చేస్తోంది. మన మెదడులోని ఆలోచనలు సూక్ష్మ విద్యుత్‌ తరంగాల రూపంలో ఉంటాయని మనకు తెలుసు. ఈ తరంగాలను కచ్చితంగా ఒడిసిపట్టి.. అందులో దాగున్న సమాచారాన్ని ఆదేశాలుగా మార్చడం బీసీఐ ప్రధాన లక్ష్యం. నరాలు చచ్చుబడిపోయిన వారిలో మళ్లీ చైతన్యం కలిగించేందుకు ఇప్పటికే బీసీఐ ఈ తరహా యంత్రాలను వాడుతున్నా.. వాటిని అమర్చేందుకు శస్త్రచికిత్స మినహా మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో అసలు శస్త్రచికిత్స అవసరం ఏమాత్రం లేని యంత్రాన్ని తయారు చేస్తే ఆలోచనలను అత్యంత వేగంగా పనులుగా మార్చవచ్చని డార్పా యోచిస్తోంది. 

ఎన్నోశేష ప్రశ్నలు.. 
మెదడు ఆలోచనలను పనులుగా మార్చేందుకు బీసీఐ తయారైతే లాభాలు ఎన్ని ఉంటాయో ఇప్పటికైతే తెలియదుగానీ.. శాస్త్రవేత్తల్లో సందేహాలు మాత్రం బోలెడు. బీసీఐ ధరించిన సైనికుడు అనుకోకుండా తప్పుడు ఆలోచన చేస్తే పరిణామాలు ఏంటి? శత్రు సైనికులకు ఈ బీసీఐలు దొరికితే ఏమవుతుంది? వంటి ప్రశ్నలు మచ్చుకు కొన్నే. అయితే నాణేనికి మరోవైపున ఈ బీసీఐలతో ఎన్నో ఉపయోగాలూ ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. మిలటరీ అవసరాలకు తయారైన టెక్నాలజీలు సాధారణ పౌర జీవితంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, జీపీఎస్, ఇంటర్నెట్‌ వంటివి వీటికి ఉదాహరణలని వారు గుర్తుచేస్తున్నారు. బీసీఐలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్లు మొదలుకొని ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాలన్నింటినీ ఆలోచనలతోనే నియంత్రించవచ్చు. పక్షవాతం వచి్చన వారు, లేదా ప్రమాదాల కారణంగా చక్రాల కురీ్చకి మాత్రమే పరిమితమైన వారు కూడా తమ ఆలోచనల శక్తితో మళ్లీ నడిచేందుకూ అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ సాకారమయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చుగానీ.. అసాధ్యమైతే కాకపోవచ్చు.    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top