
‘స్మార్ట్ బ్రేస్‌లెట్’ రూపొందించిన ‘మెటా’
చేతివేళ్ల కదలికలతోనే పనిచేసే సాంకేతికత
కంప్యూటర్ వాడకం ఇక మరింత సులభం
కీబోర్డు, మౌస్, టచ్ స్క్రీన్, వాయిస్ కమాండ్ల వంటివి లేకుండా కంప్యూటర్‌తో పనిచేయించడాన్ని ఊహించగలమా? స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌తో.. దాన్ని సుసాధ్యం చేయనుంది మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ. కేవలం మన చేతివేళ్ల కదలికలతో, వాటి సంజ్ఞలతో కంప్యూటర్లూ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను ఇకమీదట నియంత్రించవచ్చు! టెక్నాలజీ వాడకంలో ఇదో గొప్ప మలుపు కానుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వరం. మాట (వాయిస్) లేదా సాధారణ ఇన్‌పుట్ పద్ధతులు పనిచేయని సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
భవిష్యత్తులో మన చేతివేళ్ల కదలికలతోనే కంప్యూటర్‌కు అన్నీ చెప్పేయొచ్చు, వాటిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా రహస్యమైన విషయాలను ఎవ్వరికీ తెలియకుండా నిర్భయంగా కంప్యూటర్లో కంపోజ్ చేయొచ్చు.. సెర్చ్ చేయొచ్చు.. ఒకటేమిటి.. మనకు నచ్చినవన్నీ చేయొచ్చు. మెటా సంస్థ తయారుచేస్తున్న స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇప్పటికే వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే స్మార్ట్ కళ్లజోళ్లను మెటా రూపొందించింది.
మెటా రియాలిటీ ల్యాబ్స్‌లో..: ఈ సాంకేతికతకు సంబంధించిన పురోగతిని ఇటీవల ప్రముఖ జర్నల్ ‘నేచరల్’లో మెటా ప్రచురించింది. మెటాకు చెందిన వ్యాపార, పరిశోధనా విభాగం ‘రియాలిటీ ల్యాబ్స్’లో ఈ పరిశోధనలు నిర్వహించారు. సుమారు 300 మంది వివిధ రకాల పనులు చేస్తుంటే.. వారి కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను పసిగట్టేందుకు మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లకు శిక్షణ ఇచ్చారు. ఆ మోడళ్లు వారి కండరాల సందేశాలను విజయవంతంగా గ్రహించి, వారి కదలికలకు అనుగుణంగా పనిచేశాయి. ఈ రిస్ట్ బ్యాండ్‌ని మెటా ఆగ్‌మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ‘ఓరియన్’తోనూ పరీక్షించారు.
ఎలా పనిచేస్తుంది?..: మన మెదడు.. నరాల ద్వారా కండరాలకు విద్యుత్ సంకేతాలు పంపుతుంది. వీటిని ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్‌జీ) సంకేతాలు అంటారు. మన మణికట్టు దగ్గర ఉండే కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే రిస్ట్ బ్యాండ్‌ని మెటా కంపెనీ తయారుచేసింది. దీని సాయంతో కంప్యూటర్లు, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను నియంత్రించవచ్చు. ఇకమీదట కీబోర్డులు, మౌస్‌లు లేదా స్క్రీన్‌ను టచ్ చేయడం వంటివేవీ అవసరం ఉండదు. కంప్యూటర్లతో పనిచేయించడం మరింత సులభతరం, సరళతరం కానుంది. మన జేబుల్లో చేయి పెట్టి వేళ్లు కదిలించినప్పుడు కూడా ఇది పనిచేయడం విశేషం.
ఏమిటీ సాంకేతికత?
సాధారణంగా ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్‌జీ) సంకేతాలు శరీరం లోపలి నుంచి వస్తాయి. వాటిని గ్రహించి బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ‘ఉపరితల ఈఎమ్‌జీ (ఎస్‌ఈఎమ్‌జీ) సాంకేతికతగా పిలుస్తున్నారు. ఇది చాలా తేలికైన రిస్ట్ బ్యాండ్. మనం చేతిని కదిలినప్పుడు కండరాల నుంచి వచ్చే అతి సూక్ష్మ లేదా స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలను కూడా గ్రహించి పనిచేయడం దీని ప్రత్యేకత. పెద్దపెద్ద పరికరాలు, యంత్రాల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. కెమెరాలు, కొన్ని రకాల సెన్సర్లతో పనిచేసే వ్యవస్థలు మన సంజ్ఞలను గుర్తించి పనిచేస్తాయి. కానీ, మన కదలికలు స్పష్టంగా లేకపోతే ఇవి పనిచేయవు. కానీ, మన మెదడు – కంప్యూటర్ లేదా న్యూరో మోటార్ ఇంటర్‌ఫేస్‌లు.. అంటే మన శరీరం నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలతో పనిచేసే వాటితో ఈ సమస్య ఉండదని ఈ అధ్యయన కర్తలు చెబుతున్నారు.
దీంతో ఏమేం చేయొచ్చు?
⇒ ఒక టేబుల్ లేదా మన తొడ లేదా డెస్క్ లాంటి దానిపై మనం రాసిన దాన్ని కూడా ఈ రిస్ట్ బ్యాండ్ గుర్తించి, మనం ఏం రాశామో కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తుంది.
⇒ మెసేజ్‌లు టైప్ చేయొచ్చు
⇒ మెనూలు నియంత్రించ వచ్చు
⇒ చేతుల కదలికల ద్వారా డిజిటల్ కంటెంట్‌ను మనకు నచ్చినట్టు యాక్సెస్ చేయవచ్చు
ఎవరికి ఉపయోగం?
దివ్యాంగులకు..
⇒ శరీరంలోకి ప్రత్యేకమైన ఇంప్లాంట్లు లేదా సంక్లిష్టమైన పరికరాలు జొప్పించాల్సిన అవసరం లేకుండానే.. వివిధ శారీరక సామర్థ్యాలు ఉన్న వ్యక్తులకు..
⇒ సాధారణ ఇన్ పుట్ పరికరాలను ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నవారికి ..
⇒ బహిరంగంగా లేదా ప్రైవేటుగా మాట్లాడలేని సందర్భాల్లో ఏదైనా విషయాన్ని రహస్యంగా అవతలివారికి చేరవేయాల్సి వచ్చినప్పుడు..
మరిన్ని ఆవిష్కరణల కోసం..
ప్రస్తుతానికి ఈ సాంకేతికత పూర్తిగా అభివృద్ధి కాలేదు. మన శరీరం నుంచి వచ్చే సంకేతాలను గుర్తించే పరికరాలను భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని మెటా చెబుతోంది. ఈ సాంకేతికతకు సంబంధించిన డేటా, సాఫ్ట్‌వేర్ మోడళ్లు, డిజైన్ మార్గదర్శకాలను పరిశోధకులతో పంచుకునేందుకు మెటా ముందుకు వచ్చింది. తద్వారా.. కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే మరిన్ని సాంకేతికతల ఆవిష్కరణలకు ఇది తోడ్పాటు అందించనుంది.