
ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో కూడిన బోధనాంశాలు
ప్రపంచ శ్రేణి కాలేజీలతో అనుసంధానానికి రోడ్‌మ్యాప్
కొత్తగా రీజనల్ అకడమిక్, ఇన్నోవేషన్ క్లస్టర్లు
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక సాంకేతికతపై బోధన పెంచుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అన్ని స్థాయిల్లోనూ 20 శాతం మేర కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ సిలబస్‌తో కూడిన బోధనాంశాలు ఉంటాయని చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మండలి పురోగతిపై బాలకిష్టారెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
తెలంగాణ ఉన్నత విద్యా సంస్థలను ప్రపంచశ్రేణి విద్యాసంస్థలతో అనుసంధానించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రీజనల్ అకడమిక్, ఇన్నోవేషన్ క్లస్టర్లను కొత్తగా తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పాలనా వ్యవస్థను విస్తరిస్తామని తెలిపారు. ఓపెన్–యాక్సెస్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్–2047’లక్ష్యాలతో ముందుకెళ్తామని.. డ్యూయల్ డిగ్రీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల కట్టడి
రాష్ట్రంలోని డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల ఫీజుల నియంత్రణ చేపట్టాలని అన్ని వర్గాలు కోరుతున్నందున ఈ అంశాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రస్తుతం వర్సిటీల్లో పరిశోధనల స్థాయి తగ్గిందని.. వాటిని తిరిగి పెంచేందుకు అధ్యాపకులకు అవార్డులు ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు.
డీగ్రీ కోర్సుల్లో ఇకపై గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని సిలబస్ తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ‘న్యాక్’అక్రెడిటేషన్ పొందేందుకు కృషి చేస్తామని.. ‘న్యాక్’కు దరఖాస్తు చేసే కాలేజీలకు రూ. లక్ష ప్రోత్సాహకం ఇస్తామని బాలకిష్టారెడ్డి అన్నారు.
అందుబాటులో ఆంగ్ల విద్య
విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఆంగ్ల విద్యపై పట్టు సాధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దీనికోసం సరళమైన భాషలో పీడీఎఫ్, ఆడియోతో కూడిన ఆన్‌లైన్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు.
‘అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య’అనే పేరుతో దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ కౌన్సిల్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఈ మెటీరియల్ ఉచితంగా పొందొచ్చని సూచించారు. విలేకరుల సమావేశంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.