ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావన!

UN Chief Could Discuss Kashmir Issue At UN General Assembly - Sakshi

లోయలో మానవహక్కుల పరిస్థితిని ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్‌ లేవనెత్తే అవకాశం

చర్చలే సమస్యకు పరిష్కారమన్నది ఆయన నిశ్చితాభిప్రాయం

గ్యుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫానే వ్యాఖ్య

సెప్టెంబర్‌ 27న సాధారణ సభలో భారత్, పాక్‌ ప్రధానులు మోదీ, ఖాన్‌ల ప్రసంగాలు

యునైటెడ్‌ నేషన్స్‌: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో చర్చల సందర్భంగా కశ్మీర్‌ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటానియొ గ్యుటెరిస్‌ అధికార ప్రతినిధి స్టీఫానె డ్యుజారిక్‌ వెల్లడించారు. కశ్మీర్‌లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలను వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి గ్యుటెరిస్‌ లేవనెత్తవచ్చని పేర్కొన్నారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలేనన్న విషయాన్ని గ్యుటెరస్‌ బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు.

‘ప్రస్తుత కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో.. లోయలో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని గ్యుటెరస్‌ అభిప్రాయపడ్డారని స్టీఫానె తెలిపారు. సాధారణ సభ సమావేశాలను ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రధాన కార్యదర్శి ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, కశ్మీర్‌ పరిష్కారానికి భారత్‌ పాక్‌ ల మధ్య చర్చలే మార్గమని, వారు కోరితే  ఇరువర్గాలకు ఐరాస కార్యాలయం అందుబాటులో ఉంటుందని, అదే సమయంలో మానవహక్కులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని బుధవారం గ్యుటెరస్‌ అభిప్రాయపడిన విషయం ఇక్కడ గమనార్హం.

‘అక్కడ మానవ హక్కులను కచ్చితంగా గౌరవించాల్సిందే. అయితే, భారత్‌– పాక్‌ల మధ్య చర్చలే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారమని నా విశ్వాసం’ అని నాడు పాక్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు గ్యుటెరస్‌ సమాధానమిచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్‌ భారత్‌ భూభాగం. దీనికి సంబంధించిన ఏ సమస్యలోనైనా.. ఐరాస లేదా అమెరికా.. ఎవరైనా సరే మూడో శక్తి ప్రమేయాన్ని అంగీకరించబోం’ అని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై భారత్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

భారత్, పాక్‌లు కోరితేనే ఇందులో జోక్యం చేసుకుంటామని కూడా ఐరాస ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం భారత్, పాక్‌ల  సంబంధాలు కనిష్ట స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 27న న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తుతానని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేసిన విషయమూ విదితమే. అయితే, అదే సెప్టెంబర్‌ 27న భారత ప్రధాని మోదీ కూడా ఐరాస వేదికగా ప్రసంగించనుండటం విశేషం.

దీటుగా సమాధానమిస్తాం
ఐరాస వేదికపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తే అధమ స్థాయికి పాకిస్తాన్‌ దిగజారితే.. అందుకు భారత్‌ అత్యున్నత స్థాయిలో జవాబిస్తుందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలా అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తిన సందర్భాల్లో భారత్‌  తిరుగులేని విధంగా వారికి జవాబిచ్చామన్నారు.  ఇప్పటివరకు ఉగ్రవాద వ్యాప్తిలో పెరెన్నికగన్న పాకిస్తాన్‌.. ఇప్పుడు భారత్‌పై ద్వేష భావజాల ప్రచారాన్ని కూడా తలకెత్తుకుందని విమర్శించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top