వైరల్‌ : విమానాన్ని కూల్చిన ఇరాన్‌ మిస్సైల్‌..!

Ukraine Plane Was Hit By Iran Missile Viral Video - Sakshi

టెహ్రాన్ : ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్తున్న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమాన ప్రమాదంపై సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ.. విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై అమెరికా, కెనడా, ఉక్రెయిన్‌తో పాటు పలు అగ్ర దేశాలు తొలినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విమానంపై ఇరాన్‌కు చెందిన టోర్‌ మిస్సైల్‌ దాడి చేసిందని ఆరోపిస్తున్నాయి. కానీ ఆ దేశాల ఆరోపణలు ఇరాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. అయితే ఈ సమయంలో విమానంపై క్షిపణి దాడి చేసినట్లు ఉన్న ఈ వీడియో బయటపడింది. క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కానీ ఆ వీడియో ప్రామాణికతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. (మీరే కూల్చారు... సమాచారం ఇవ్వండి!)

వీడియోలో మిస్సైల్‌ ఢీ కొట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ అది ఉక్రేయిన్‌ విమానమని నిర్థారణకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ క్షిపణి దాడివల్లే తమ విమానం కూలిపోయి ఉంటుందని ఉక్రెయిన్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్‌.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఉక్రెయిన్‌ విమానం కుప్పకూలిందని అభిప్రాయపడుతోంది. దీనిపై ఆ దేశ జాతీయ భద్రత సంఘం కార్యదర్శి ఒలెక్సీ డానిలోవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై క్షిపణి దాడి సహా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. విమానం కూలిపోయిన ప్రాంతానికి సమీపంలో ఈ క్షిపణుల ఆనవాళ్లు దొరికాయని పలువురు చెప్పినట్లు ఆయన తెలిపారు.

బోయింగ్‌ ఎయిర్‌లైనర్‌ను ఇరాన్‌ కూల్చివేసిందని తమకు ఇప్పటికే పలు ఇంటలెజిన్స్‌ నివేదికలు అందాయన్నని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో పేర్కొన్నారు. టెహ్రాన్‌ నుంచి బయల్దేరగానే విమానం కుప్పకూలడం వెనుక ఇరాన్‌ దాడుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సైతం జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చకపోయినా.. దాడుల్లో భాగంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు మరోవైపు ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్‌ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్‌ సంస్థకు కానీ, అమెరికాకి కానీ  ఇచ్చేదిలేదని ఇరాన్‌ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా వీడియోపై ఉక్రేయిన్‌, కెనడా ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీడియో నిజమని తేలితే ఇరాన్‌కు కొంచె ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top