మరో 3000 మంది ఉబర్‌ ఉద్యోగులపై వేటు

Uber Axis 7000 Jobs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక క్యాబ్‌ల నెట్‌వర్క్‌ కలిగిన ఉబర్‌ సంస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇంతకుముందే ప్రపంచ వ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించిన ఈ కంపెనీ సోమవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా మరో 45 ఆఫీసులను మూసివేయడం ద్వారా మరో 3000 మంది ఉద్యోగులకు తిలోదకాలిచ్చింది. తాజాగా మూసివేసిన ఆఫీసుల్లో శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయం కూడా ఆ ఒక్క ఆఫీసును మూసివేయడం ద్వారానే 500 మందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉద్యోగుల ఉద్వాసన విషయాన్ని వారికి ఈ మెయిల్స్‌ ద్వారా తెలియజేసినట్లు ఉబర్‌ కంపెనీ సీఈవో డారా కోష్రోవ్‌షాహి మీడియాకు తెలిపారు. (మహా నగరాలే కరోనా కేంద్రాలు)

కరోనా వైరస్‌ కారణంగా గతేడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ క్యాబ్‌ల రైడింగ్‌ 80 శాతం పడి పోయిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉబర్‌ కంపెనీలో 22 వేల మంది పని చేస్తుండగా ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మందిని తొలగించారు. కాంట్రాక్ట్‌పై పనిచేసే క్యాబ్‌ డ్రైవర్లు ఉద్యోగుల పరిధిలోకి రారు. నిజంగా చెప్పాలంటే మూడు నెలల నుంచి ఉపాధిలేక ఉబర్‌ డ్రైవర్లు ఎక్కువగా నష్టపోయారు. అసలే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరగి పోతుంటే పుండు మీద కారం చల్లిన చందంగా ఇక ముందు ఉబర్‌ కంపెనీ డ్రైవర్‌లెస్‌ కార్లపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈవో చెప్పారు. (భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top