ఫ్లోరెన్స్‌.. కేటగిరీ–4 తుపాను

Trump says authorities 'totally prepared' for Hurricane Florence - Sakshi

కరోలినా తీరానికి చేరువగా

విల్మింగ్టన్‌: అమెరికాకు పెనుముప్పుగా పొంచి ఉన్న కేటగిరీ–4 భీకర తుపాను ఫ్లోరెన్స్‌ గంటకు 225 కి.మీ. వేగంతో కరోలినా తీరానికి చేరువగా వచ్చింది. అప్రమత్తమైన తీర ప్రాం తంలోని ప్రజలు నిత్యావసరాలను వెంట తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీరు, ఆహారం, ఇతర తినుబండారాలు కొనేందుకు ప్రజలు మార్ట్‌ల ముందు బారులు తీరారు. చాలా దుకాణాల్లో ఇప్పటికే సరుకు నిల్వలు అయిపోయాయి. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం హరికేన్‌ తూర్పు తీరాన్ని తాకొచ్చని అంచనా.

ఆ తరువాత దాని ఉధృతి తగ్గి 30–60 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరించారు. దీని ఫలితంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడంతో పాటు, పర్యావరణం మీద కూడా భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  అత్యంత ప్రమాదకర కేటగిరీ–4కు చెందిన హరికేన్‌లు తూర్పు తీరాన్ని తాకడం అరుదని ఐరాస పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top