అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ ఎందుకు?

Trump ridicules Modi over funding 'library' in Afghanistan - Sakshi

మోదీని అవహేళన చేస్తూ ట్రంప్‌ వ్యాఖ్య

తిప్పికొట్టిన విదేశాంగ శాఖ

వాషింగ్టన్‌: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్తాన్‌లో భద్రతను పట్టించుకోకుండా భారత ప్రధాని మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హేళన చేశారు. అఫ్గాన్‌ భద్రతకు భారత్‌ సహా ఇతర దేశాలు చేయాల్సినంతగా చేయలేదని విమర్శించారు. అఫ్గానిస్తాన్‌కు బలగాలు పంపాలని అమెరికా తరచూ ఒత్తిడి చేస్తున్నా భారత్‌ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌లో భారత్‌ చేపట్టిన అభివృద్ధి పనుల్ని అమెరికా అధ్యక్షుడు పరిహసిస్తూ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ట్రంప్‌ ఏ లైబ్రరీ ప్రాజెక్టును ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అఫ్గానిస్తాన్‌ భద్రతకు చేస్తున్న ఖర్చుపై మాట్లాడుతూ ట్రంప్‌..భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారు. ‘ మోదీని కలిసినప్పుడు అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ నిర్మిస్తున్నానని పదేపదే చెప్పారు. మోదీ లాంటి నాయకులు అఫ్గానిస్తాన్‌ అభివృద్ధికి ఎంతో ఖర్చు చేశామని చెబుతున్న మొత్తం మనం చేస్తున్న వ్యయం కన్నా చాలా తక్కువ. ఆ లైబ్రరీని ఆ దేశంలో ఎవరైనా వినియోగిస్తున్నారా? నాకైతే తెలీదు.

అయినా లైబ్రరీ ఏర్పాటుచేసినందుకు మనం భారత్‌కు ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చింది. మనం అక్కడ ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం’ అని ట్రంప్‌ వెటకారంగా అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ కొట్టివేసింది. భారత్‌ చేస్తున్న సాయం ఆ దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది. అఫ్గాన్‌ ప్రజల అవసరాల మేరకు పలు మౌలిక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల్ని అమలుచేస్తున్నామంది.

లాటరీకి ముగింపు పలకాలి
ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారికే అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. లాటరీ విధానంలో వీసాలు ఇవ్వడం సరికాదని.. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top