జన్మతః ఇచ్చే పౌరసత్వం రద్దు!

Trump claims he can defy Constitution and end birthright citizenship - Sakshi

మరో షాకింగ్‌ నిర్ణయానికి ట్రంప్‌ యోచన

వాషింగ్టన్‌: వరుస వలస సంస్కరణ నిర్ణయాలతో గుబులు పుట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో తీవ్ర నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. అమెరికా పౌరులు కానివారు, అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతః ఇచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలని యోచిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయన ఈ హామీనిచ్చినా, అమెరికాలో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ఆయన మళ్లీ తెరపైకి తెచ్చారు.

అమెరికా పౌరులకు కాకుండా ఇతర దేశస్తులకు అమెరికాలో జన్మించే పిల్లలకు పౌరసత్వాన్ని ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితి, పౌరసత్వంతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికా పౌరులే అవుతారు. ఈ నిబంధనను మార్చి, అమెరికా పౌరసత్వం ఉన్న వారికి పుట్టే బిడ్డలను మాత్రమే అమెరికా పౌరులుగా గుర్తించేలా ఆదేశాలిచ్చేందుకు ట్రంప్‌ కసరత్తు చేస్తున్నారు.

‘అమెరికాలో పుట్టే ఇతర దేశాలవారి పిల్లలందరికీ అమెరికా పౌరసత్వం ఇచ్చే నిబంధనను రద్దు చేయాలనుకుంటున్నాను’ అని ట్రంప్‌  వెల్లడించారు. రాజ్యాంగం నుంచి ఆ నిబంధనను తొలగించడం సులభం కాదనీ, ట్రంప్‌ ఆదేశాలను అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉంటుందనీ, కోర్టు కూడా ఇందుకు ఒప్పుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top