హెచ్‌1బీ వీసా ; ఐటీ నిపుణులకు చల్లటి కబురు | Sakshi
Sakshi News home page

హెచ్‌1బీ వీసా ; ఐటీ నిపుణులకు చల్లటి కబురు

Published Tue, Jan 9 2018 1:12 PM

Trump administration drops H-1B visa proposal relief for Indians - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో పనిచేస్తోన్న విదేశీ ఉద్యోగులకు, ప్రత్యేకించి భారత ఐటీ నిపుణులకు చల్లటి వార్త. హెచ్1బీ వీసాదారులకు పొడిగింపును రెండుసార్లకే పరిమితం చేయాలన్న ఆలోచనను ట్రంప్‌ ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనపెట్టేసింది. ట్రంప్‌ అమలులోకి తీసుకొచ్చిన ‘బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌’ విధానాన్ని అనుసరిస్తూ.. హెచ్‌1బీ వీసాల పొడగింపు రెండు సార్లకే(6 సంవత్సరాలకే) పరిమితం చేయాలన్న ఆలోచనకు స్వస్తిపలికినట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) సోమవారం ఒక ప్రకటన చేసింది. తద్వారా అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డ్ వచ్చేలోగా తమకున్న హెచ్1బీ వీసాలను ఎన్నిసార్లయినా పొడిగించుకోవడానికి విదేశీ ఉద్యోగులకున్న వెసులుబాటు యధావిధిగా కొనసాగనుంది.

ఎక్కువ నైపుణ్యం ఉన్న ఇతర దేశాల సిబ్బందిని  హెచ్1బీ వీసా ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించడానికి 2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ (ఉభయసభలు- సెనెట్, ప్రతినిధుల సభ) అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వెంటీఫస్ట్ సెంచరీ చట్టం చేసింది. 17 సంవత్సరాలుగా ఈ చట్టం అమల్లో ఉంది. గ్రీన్ కార్డ్ కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా హెచ్1బీ వీసాలను ‘ఎన్నిసార్లయినా పొడిగించే ’ అవకాశం ప్రస్తుత చట్టంలో ఉంది.

అయితే కేవలం రెండుసార్లు మాత్రమే పొడగింపునకు అవకాశమిచ్చేలా చట్టంలో మార్పులు చేయాలని ట్రంప్‌ సర్కారు యత్నాలు ఆరంభించింది. ఈ ప్రతిపాదనలను పలువురు చట్టసభ్యులేకాక యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (యూఎస్‌సీసీ) సైతం వ్యతిరేకించింది. వీసా పొడగింపులపై ఆంక్షలు విధిస్తే ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థ అసలు లక్ష్యం నీరుగారిపోతుందని, ఎన్నో ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తూ, ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే ప్రతిభావంతులకు స్థానం లేదనడం ఏ మాత్రం సరైనది కాదని ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వీసాదారులను తిరిగి స్వదేశాలకు పంపేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారానికి, మొత్తంగా దేశానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని యూఎస్‌సీసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement