
అణు బాంబుల పక్కనే పడుకుంటున్నామా?
పలు దేశాలు పక్కలోనే అణు బాంబులు పెట్టుకొని పడుకుంటున్నాయని చెప్పవచ్చు
న్యూయార్క్: భూమధ్య రేఖకు దక్షిణంలో ఉన్న దేశాల ప్రజలు అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే అమెరికా, జర్మనీ, రష్యా, చైనా, భారత దేశాలు పక్కలోనే అణు బాంబులు పెట్టుకొని పడుకుంటున్నాయని చెప్పవచ్చు. ఈ దేశాల్లో ప్రజల ఆవాస ప్రాంతాలకు దగ్గరలోనే అణు బాంబులు ఉన్నాయి. ఈ విషయాన్ని ‘రియల్లైఫ్రోల్’ రూపొందించిన వీడియో తెలియజేస్తోంది.
సియాటెల్, వాషింగ్టన్ నగరాలకు కేవలం 18 మైళ్ల దూరంలో, డెన్వర్, కోలరాడోకు 77 మైళ్ల దూరంలో అణు బాంబులు ఉన్నాయి. యూరప్ ప్రధాన నగరాలన్నింటి పరిధిలోనే అణు బాంబులు ఉన్నాయి. లండన్, వెనిస్, మిలన్, రాటర్డర్మ్ నగరాలన్నింటికీ 50 మైళ్ల రేంజ్లో ఈ అణు బాంబులు ఉన్నాయి. భారత్‌తోపాటు పాకిస్థాన్, ఉత్తర కొరియా వద్ద కూడా అణు బాంబులు ఉన్నాయి. అయితే ఏ దేశం ఈ బాంబులను ఎక్కడ దాచిందో మరో దేశానికి తెలియకపోవడం ఆందోళనకరం.
కానీ అన్నింటికన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అమెరికా, రష్యా దేశాల వద్ద కనుమరుగైన దాదాపు 50 అణు బాంబులు ఎక్కడ ఉన్నాయన్నదే. వీటిలో ఎక్కువగా సముద్రాల అడుగున ఉన్నట్లు భావిస్తుండగా, కొన్ని బాంబాలు మానవ ఆవాస ప్రాంతాలకు దగ్గరగానే ఉంటాయని అనుమానిస్తున్నారు.