అమెరికా ఉనికి ఉన్నంత వరకూ పోరాటం!

Taliban Delegation Visits Russia After Trump Says Talks Dead - Sakshi

మాస్కో : తాలిబన్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఎప్పుడెప్పుడు అఫ్గనిస్తాన్‌ నుంచి బయటపడదామా అని చూస్తున్న అమెరికా ఇప్పుడు సంకట స్థితిలో పడింది. గత వారం కాబూల్‌లో తాలిబన్లు జరిపిన బాంబుదాడిలో అమెరికా సైనికునితో సహా పలువురు అఫ్గన్‌లు చనిపోవడం తెలిసిందే. దీంతో తాలిబన్లలతో చర్చలు ఇక ముగిసినట్లే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ ఈ ప్రాంతంలో పరిణామాలు రోజుకోరకంగా మారుతున్నాయి. తాలిబన్‌ ప్రతినిధులు మాస్కోలో రష్యాతో చర్చలు జరిపారు. మొన్నటి వరకు తాలిబన్లతో శాంతి చర్చలు ఒక ముగింపుకు వచ్చాయని అనుకుంటున్న నేపథ్యంలో చర్చలు ఇక ముగిసినట్లే అని ట్రంప్‌ వ్యాఖ్యానించడం, ఇప్పుడు తాలిబన్లు రష్యాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకొంది. మాస్కో సమావేశంలో అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలు జరగాల్సిందేనని రష్యా తాలిబన్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. 

క్యాంప్‌ డేవిడ్‌ ఒప్పందం
అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు ఖతార్‌లో అక్టోబర్‌ 2018లో ప్రారంభమయ్యాయి. 2001లో ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై(9\11) దాడి చేశారని ఆరోపిస్తూ అమెరికా సైన్యం అఫ్గన్‌ గడ్డపై అడుగుపెట్టింది. అప్పటి నుంచి 18 సంవత్సరాల పాటు అమెరికా, తాలిబన్ల మధ్య సాగిన యుద్ధం ముగింపే లక్ష్యంగా చర్చలు సాగుతాయని ఇరువర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మొత్తం 9సార్లు సమావేశమైన తర్వాత శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుందని ఇరువర్గాలు ప్రకటించాయి. అయితే, ఇటీవల తాలిబన్ల కారుబాంబు దాడిలో అమెరికా సైనికులు చనిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా చర్చల నుంచి తప్పుకుంది.  దీనిపై తాలిబన్‌ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్‌ ప్రతినిధి ఒకరు మాస్కోలో మాట్లాడుతూ ట్రంప్‌ నిర్ణయం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. కాబూల్‌లో దాడి అమెరికా చర్యలకు ప్రతిస్పందనగానే జరిగిందని చెప్పారు. ట్రంప్‌ తిరిగి చర్చలపై పునరాలోచించుకోవాలని సూచించారు. యుద్ధమే అనివార్యమనుకుంటే అమెరికా ఉనికి ఉన్నంత వరకూ తాలిబన్లు పోరాడుతుంటారని స్పష్టం చేశారు. 

అడకత్తెరలో పాక్‌
పాకిస్తాన్‌ సహాయంతో రష్యాకు వ్యతిరేకంగా తాలిబన్లను సృష్టించింది అమెరికా అనేది జగమెరిగిన సత్యం. మారిన పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్లు తమపైనే తిరగబడటంతో వారిని ఏరివేసే పనిని అమెరికా 2001 నుంచి మొదలుపెట్టింది. ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా అఫ్గన్‌లో అడుగుపెట్టిన అమెరికాకు అది శక్తికి మించిన పని కావడంతో ఎలాగైనా అఫ్గన్‌ నుంచి బయటపడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాలిబాన్లతో పోరులో పాకిస్తాన్‌ బలిపశువు అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు సహాయపడటంతో ఇప్పుడు పాక్‌ కోలుకోలేకపోతుందని అన్నారు. తాలిబన్లతో చర్చలు సఫలమై ఈ ప్రాంతంలో అమెరికా వైదొలిగితే ఉగ్రవాదులను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చనేది పాక్‌ ఆలోచన. ఇప్పుడు పరిస్థితులు తిరిగి మొదటికి రావడంతో అటు అమెరికాకు దగ్గరకాలేక, ఇటు తాలిబన్లను మచ్చిక చేసుకోలేక పాక్‌ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇమ్రాన్‌ వ్యూహాత్మకంగా రష్యన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాను విమర్శించారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా తాలిబన్లు రష్యాతో చర్చలు జరపడం చూస్తుంటే ఇమ్రాన్‌ ఉద్దేశం తాలిబన్‌లవైపే మొగ్గినట్లుగా ఉందని అంటున్నారు. 

చదవండి : ట్రంప్‌ ప్రమాదకర విన్యాసాలు

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top