
న్యూఢిల్లీ/ముంబై/లండన్: పద్మావతి సినిమా వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ఆ సినిమాను విదేశాల్లో విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ తాజాగా దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 28న విచారించేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకుంది. పద్మావతి పాటలు, ప్రోమో విడుదల విషయంలో సెన్సార్ బోర్డు ఆమోదం తెలపడంపై ఆ సినిమా నిర్మాతలు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించేందుకు సమ్మతించింది.
భారత్‌కు వెలుపల పద్మావతిని విడుదల చేస్తే సామాజిక సామరస్యానికి దారుణమైన నష్టం వాటిల్లుతుందని శర్మ ఆరోపించారు. ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్నాయని భావిస్తున్న కొన్ని సీన్లను తొలగించాల్సిందిగా కోరుతూ గతంలో శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అనుమతులివ్వలేదని, అలాంటప్పుడు చట్టబద్ధమైన సంస్థ తన పని తాను చేసే విషయంలో ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పింది.
‘పద్మావతి’కి బ్రిటన్‌లో క్లియరెన్స్
పద్మావతి సినిమా విడుదలకు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (బీబీఎఫ్‌సీ) ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా, ఏ సీన్‌ను కూడా కట్ చేయకుండా అన్ని అనుమతులిచ్చింది. బీబీఎఫ్‌సీ పద్మావతికి 12ఏ రేటింగ్ ఇచ్చింది. అంటే 12 ఏళ్ల లోపు పిల్లలు పెద్దలతో కలిసే చూడాలని అర్థం. అయితే భారత్‌లోని సెన్సార్ బోర్డు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ఆ అనుమతులు వచ్చే వరకు ప్రపంచంలో ఎక్కడా విడుదల చేయలేమని ఆ సినిమా వర్గాలు చెప్పాయి. దాదాపు 50 దేశాల్లో ఈ సినిమా విడుదలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నాయి.