స్పైడర్ మ్యాన్ చెప్పిన పాఠం... | Spider-Man told the lesson | Sakshi
Sakshi News home page

స్పైడర్ మ్యాన్ చెప్పిన పాఠం...

Jun 8 2016 3:20 AM | Updated on Sep 4 2017 1:55 AM

స్పైడర్ మ్యాన్  చెప్పిన పాఠం...

స్పైడర్ మ్యాన్ చెప్పిన పాఠం...

న్యూయార్క్‌లో విలన్లతో ఫైటింగులు వంటివి లేనప్పుడు స్పైడర్‌మ్యాన్ మెక్సికోలో కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెబుతుంటాడు..

న్యూయార్క్‌: న్యూయార్క్‌లో విలన్లతో ఫైటింగులు వంటివి లేనప్పుడు స్పైడర్‌మ్యాన్ మెక్సికోలో కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెబుతుంటాడు.. ఆ విషయం మీకు తెలుసా? ఇదేం సినిమాలో ఉంది అని బుర్ర గోక్కోకండి.. ఇది సినిమా కాదు.. జీవితం. ఈ ఫొటో చూడండి.. నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికోలో స్పైడర్ మ్యాన్ విద్యార్థులకు ఎలా చక్కగా పాఠాలు చెబుతున్నాడో.. ఇతడి పేరు మోయ్ వాజ్‌క్వెజ్ రేయిస్.. 2002లో అంట.. అప్పటికి మోయ్‌కు 12 ఏళ్లు.. తొలిసారిగా స్పైడర్ మ్యాన్ సినిమా చూశాడు.. అంతే.. ఆ పాత్రతో ప్రేమలో పడిపోయాడు. ఎంతగా అంటే.. చివరికి తాను స్పైడర్ మ్యాన్ డ్రస్‌లోనే తిరిగేటంత.. తన కోసం దాదాపు సినిమా స్థాయిలోనే మంచి డ్రస్ రెడీ చేయించుకున్నాడు. 2014 నుంచి ఇతడిలా స్పైడర్ మ్యాన్‌లాగే తిరుగుతున్నాడు.

తన అభిమాన పాత్రకు సంబంధించిన కామిక్‌లు మరింతగా చదవడం ప్రారంభించాడు. అందులోని ఓ కామిక్‌లో స్పైడర్ మ్యాన్‌కు ఓ అకాడమీలో సబ్‌స్టిట్యూట్ టీచర్ ఉద్యోగం ఆఫర్ వస్తుంది. దీంతో మోయ్ ఆలోచనలో పడ్డాడు. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు. అసలు స్పైడర్ మ్యాన్ కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెబితే ఎలాగుంటుంది అని ఆలోచించాడు. మెక్సికో వర్సిటీలో చేరిపోయాడు. కంప్యూటర్ లాజిక్, హైయర్ ఆల్‌జీబ్రా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పాఠాలను బోధిస్తున్నాడు. తొలుత ఇంట్లోవాళ్లు భయపడ్డా.. వర్సిటీలోని విద్యార్థులు, సహ అధ్యాపకుల నుంచి వస్తున్న స్పందన చూసి.. ఇప్పుడు తెగ సంతోషపడిపోతున్నారు.

ఇతడిని యూనివర్సిటీ లో అందరూ స్పైడ్‌మోయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే.. మోయ్ అన్ని రోజులు ఈ డ్రెస్‌లో క్లాసులకు వెళ్లడు. ముఖ్యమైన క్లాసులు చెప్పాలన్నా.. విద్యార్థులకు పరీక్షలున్నా.. వర్సిటీకి స్పైడర్ మ్యాన్ డ్రస్ వేసుకుని వెళ్తాడు. తద్వారా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడంతోపాటు క్లాసులు చెప్పే సమయంలో వారి దృష్టి తన వైపు ఉండేలా చూసుకుంటాడట. అటు విద్యార్థులు కూడా ఇతడి క్లాసులు మిస్సవరట.  స్పైడర్ మ్యాన్ మాకు పాఠాలు చెబుతుంటాడు అని అందరికీ గొప్పగా చెప్పుకుంటారట.

Advertisement
 
Advertisement
Advertisement